దుమ్మురేపిన రికీబుయ్‌

4 Nov, 2018 12:12 IST|Sakshi

150 పరుగులతో రాణించిన లోకల్‌ ఆటగాడు

ఆంధ్ర ఐదు వికెట్లకు 327

 రాణించిన భరత్, సుమంత్‌

విశాఖ స్పోర్ట్స్‌: స్థానిక కుర్రాడు రికీబుయ్‌ ఆంధ్ర జట్టును ఆదుకున్నాడు. 150 నాటౌట్‌ పరుగులతో క్రీజ్‌లో నిలిచి నాలుగో రోజు ఆటను కొనసాగించనున్నాడు. 54/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఆట ప్రారంభించిన ఆంధ్ర జట్టు మరో రెండు వికెట్లే కోల్పోయి 273 పరుగులు చేసి మూడు రోజు ఆటలో నిలదొక్కుకుంది. ఇక్కడి వైఎస్‌ఆర్‌ స్టేడియంలో రంజీ తొలి మ్యాచ్‌లో ఆంధ్రతో తలపడుతున్న పంజాబ్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 414 పరుగులకు ఆలౌటైన విషయం విదితమే. ఆంధ్ర జట్టు 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన స్థితిలో స్థానిక కుర్రాళ్లు రికీబుయ్, భరత్, సుమంత్‌లు ఆంధ్రను ఆదుకున్నారు. ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల కోల్పోయి 327 పరుగులు చేసింది. ఆట ఆదివారంతో ముగియనుంది. 

రికీబుయ్‌ 150 నాటౌట్‌
కెప్టెన్‌ విహారీతో పాటు ఓపెనర్లు ప్రశాంత్, అశ్విన్‌లు తక్కువ స్కోర్‌కే వెనుతిరగడంతో మ్యాచ్‌ను కాపాడే బాధ్యతను విశాఖ కుర్రాళ్లు తీసుకున్నారు. రికీబుయ్‌ 291 బంతులాడి 13 ఫోర్లు, 4 సిక్సర్లతో చెలరేగి 150 పరుగులతో క్రీజ్‌లో నిలిచి మ్యాచ్‌ను తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దిశగా నడిపిస్తున్నాడు. లంచ్‌ బ్రేక్‌ వరకు వికెట్‌ కోల్పోకుండా రికీకి కెఎస్‌ భరత్‌ సహకరించి 175 బంతులాడి ఆరుఫోర్లు, ఒక సిక్సరుతో 76 పరుగులు చేశాడు. మరో విశాఖ కుర్రాడు బి.సుమంత్‌ 54 పరుగులు చేశాడు. కరణ్‌శర్మ నాలుగు పరుగులతో క్రీజ్‌లో నిలిచాడు. 

మిడిలార్డర్‌లో..
ఆంధ్ర స్కోర్‌ 190 పరుగుల వద్ద భరత్‌ ఆవుట్‌ కాగా... సుమంత్‌ 322 పరుగులకు చేర్చి వెనుతిరిగాడు.  రికీబుయ్‌ 224 బంతులాడి పదిఫోర్లు, మూడు సిక్సర్లతో సెంచరీ నమోదు చేయగా మరో ఆరవై ఏడు బంతులాడి 150 పరుగుల మార్కుకు చేరుకున్నాడు. నాలుగో వికెట్‌కు భరత్, రికీబుయ్‌ 151పరుగులు జోడించడగా ఐదో వికెట్‌కు రికీబుయ్‌తో కలిసి సుమంత్‌ 132 పరుగుల భాగస్వామ్యాన్నందించాడు. కార్తీక్‌ రామన్, అయ్యప్ప, విజయ్‌కుమార్, షోయబ్‌ చివరిరోజు ఆంధ్ర తరపున బ్యాటింగ్‌ చేయనున్నారు. పంజాబ్‌ తరపున రంజీల్లో ఆరంగేట్రం చేసిన మార్కండే ఇప్పటికే మూడు వికెట్లు తీశాడు.

మరిన్ని వార్తలు