6కిపైగా కొత్త పారిశ్రామిక పాలసీలు ! 

10 Aug, 2019 10:54 IST|Sakshi

పెట్టుబడులే లక్ష్యంగా రూపకల్పనపై కసరత్తు

త్వరలో ప్రకటించనున్న రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, అమరావతి: పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా త్వరలో 6కిపైగా నూతన పారిశ్రామిక విధానాలను ప్రకటించనున్నట్లు పరిశ్రమలు, వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ భార్గవ తెలిపారు. ప్రస్తుత పాలసీల కంటే అధిక ప్రయోజనాలను అందించేలా 3 – 5 నెలల వ్యవధిలో కొత్త విధానాలను అమలులోకి తెస్తామన్నారు. శుక్రవారం విజయవాడలో జరిగిన డిప్లొమాటిక్‌ ఔట్‌ రీచ్‌ కార్యక్రమంలో పెట్టుబడులు, పారిశ్రామికాభివృద్ధిపై ఆయన మాట్లాడారు. సమగ్ర పారిశ్రామిక పాలసీతోపాటు, ఆటోమొబైల్, ఐటీ, బయోటెక్నాలజీ, పెట్రో కెమికల్స్, ఏరోస్పేస్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ లాంటి ఆరుకు పైగా రంగాలకు ప్రత్యేక పాలసీలను తీసుకురానున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విదేశీ పెట్టుబడిదారులకు సహకారం అందించేందుకు ఢిల్లీలో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కార్యాలయాలు ప్రారంభించాలనుకుంటే ఉచితంగా ఆఫీస్‌ స్పేస్‌ను అందచేస్తామన్నారు. రాష్ట్రానికి 974 కి.మీ సుదీర్ఘ తీర ప్రాంతంతోపాటు నాలుగు పోర్టులు అందుబాటులో ఉన్నాయని, త్వరలోనే మరో నాలుగు పోర్టులు నిర్మించనున్నామని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

ఆటోమొబైల్‌ రంగంలో పెట్టుబడులకు అవకాశం
ఏపీలో ఇప్పటికే 6 ఎయిర్‌పోర్టులు అందుబాటులో ఉండగా మరో మూడు నిర్మాణ దశలో ఉన్నాయని రజత్‌ భార్గవ చెప్పారు. విశాఖ సమీపంలో ఏర్పాటు చేస్తున్న కొత్త ఎయిర్‌పోర్టులో పెట్టుబడులు పెట్టడానికి జ్యూరిచ్‌ ఆసక్తి వ్యక్తం చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌లను ఏర్పాటు చేయాలని కోరారు. కొరియా, చైనా, బ్రిటన్‌ తదితర దేశాలు ఉక్కు కర్మాగారాల ఏర్పాటుపై ఆసక్తి చూపిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజారవాణా వ్యవస్థలో డీజిల్‌ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఆటోమొబైల్‌ రంగంలో భారీ పెట్టుబడులకు ఏపీలో అవకాశాలున్నాయన్నారు. 31 చోట్ల ఎంఎస్‌ఎంఈ పార్కులను కూడా ఏర్పాటు చేశామన్నారు. కష్టాల్లో ఉన్న 86,000కిపైగా ఎంఎస్‌ఎంఈలకు నవోదయం పథకం కింద రుణాలను రీ షెడ్యూల్‌ చేయడం ద్వారా ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. కాకినాడ సెజ్‌లో పెట్రో కెమికల్స్‌లో భారీ పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలున్నాయని, పెట్టుబడిదారులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.

ఏపీలో అపార అవకాశాలు
రాష్ట్రంలో పర్యాటక రంగంలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ధి ముఖ్య కార్యదర్శి కె.ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ఆధ్యాత్మిక కేంద్రాల నుంచి బీచ్‌ టూరిజం, ఎకో టూరిజం వరకు అనేక సర్క్యూట్లు ఉన్నాయని, వీటిని వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్రంలోని బౌద్ధ కేంద్రాల్లో ఉన్న అవకాశాలను జపాన్‌ లాంటి దేశాలు వినియోగించుకోవాలన్నారు. హెల్త్‌ టూరిజంలో కూడా పెట్టుబడులకు రాష్ట్రం అనువైనదని వివరించారు. అపోలో, కేర్, రెయిన్‌బో లాంటి ప్రముఖ ఆస్పత్రులు ఇప్పటికే ఏర్పాటయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌రెడ్డి తెలిపారు. 

రాష్ట్రంలో 86,219 మంది డాక్టర్లు ఉండగా ఏటా 29 వైద్య కళాశాలల నుంచి 5,000 మందికిపైగా గ్రాడ్యుయేట్లు పట్టాలు తీసుకుంటున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజలు ఆర్థికంగా పరిపుష్టి సాధించడం కోసం ప్రభుత్వం నవరత్నాలు ద్వారా సంక్షేమ పథకాలను అందిస్తోందని ముఖ్యమంత్రి సలహాదారు ఎం.శామ్యూల్‌ తెలిపారు. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా, వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, వైఎస్‌ఆర్‌ ఆసరా, దశలవారీ మధ్యనిషేధం, జలయజ్ఞం, ఫించన్ల పెంపు, ఫీజు రీయింబర్స్‌మెంట్, అందరికీ ఇల్లు లాంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన ఏపీలో ఫిషరీస్‌తో పాటు పాడి, పశుసంవర్థక రంగాల్లో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయని మత్స్య, పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య వివరించారు.

 అనూహ్య స్పందన: విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి హరీష్‌
రాష్ట్రాల్లో పెట్టుబడుల అవకాశాలను గుర్తించేందుకు తొలిసారిగా ఏర్పాటు చేసిన డిప్లొమాటిక్‌ ఔట్‌రీచ్‌ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించిందని విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి పి.హరీష్‌ తెలిపారు. శుక్రవారం విజయవాడలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ పలు దేశాల రాయబారులు, ప్రతినిధులు హాజరుకావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగంలో  పెట్టుబడులు పెట్టడానికి ఏపీలో అపార అవకాశాలున్నాయని దీన్ని వినియోగించుకోవాల్సిందిగా విదేశీ ప్రతినిధులను కోరారు.  

>
మరిన్ని వార్తలు