ఏపీ, తెలంగాణల్లో పర్యాటకానికి మహర్దశ!

23 Jul, 2014 02:09 IST|Sakshi

 సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పర్యాటక కేంద్రాలు అభివృద్ధి బాట పట్టనున్నాయి. ఇప్పటి వరకు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడిన ఆయా కేంద్రాల అభివృద్ధికి ఆర్థిక సాయం చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. ఫలితంగా ఇరు రాష్ట్రాల్లోని పర్యాటక కేంద్రాలూ అభివృద్ధి చెందనున్నాయి. మెగా సర్క్యూట్ విభాగంలో వరంగల్-కరీంనగర్, కొండపల్లి - ఇబ్రహీంపట్నం, సర్క్యూట్ విభాగంలో.. రాచకొండ కోట-ఆరుట్ల(దేవాలయం)-రంగాపూర్ వేదశాల-గాలిషాహీద్ దర్గా-అల్లాపురం గ్రామం(దేవాలయాలు), నారాయణపూర్ (దేవాలయాలు), శివన్న గూడెం రాక్ ఫార్మేషన్స్- వ్యాలీ ఆఫ్ బంజారా సర్క్యూట్స్, గుంటూరులోని గుత్తికొండ బిలం గుహలు, పిడుగురాళ్ల-కొండవీడు ఖిల్లా- కోటప్పకొండ గుడి సర్క్యూట్, శ్రీకాకుళంలోని బుద్ధ సర్క్యూట్‌లు ఉన్నాయి.
 
 పర్యాటక గమ్యస్థానాల విభాగంలో నాగార్జున సాగర్, హైదరాబాదులోని దుర్గంచెర్వు, థీమ్ పార్క్‌ల అభివృద్ధి, శ్రీకాళహస్తిలో సౌండ్ అండ్ లైట్ షో, ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఖమ్మం ఖిల్లా పరిసర ప్రాంతాల అభివృద్ధి, కరీంనగర్‌లోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, పశ్చిమ గోదావరి జిల్లాలోని పేరుపాలం బీచ్ అభివృద్ధి, నల్లగొండ జిల్లాలోని పానగల్ గుడి, ఉదయసముద్రం ప్రాంతాల్లో పర్యాటకులకు సదుపాయాలు కల్పించనున్నట్టు తెలిపారు. కాకతీయ, కాకినాడ బీచ్, లేపాక్షి, ఫ్లెమింగో, తారామతి బరాదరి ఉత్సవాల నిర్వహణ ప్రాధామ్యాలుగా పెట్టుకున్నట్టు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి శ్రీపద్ యశోనాయక్ మంగళవారం లోక్‌సభలో లిఖిత పూర్వకంగా బదులిచ్చారు.
 

మరిన్ని వార్తలు