అనస్థీషియా వైద్యుడి వీరంగం

17 May, 2020 04:29 IST|Sakshi
ఫోర్త్‌టౌన్‌ స్టేషన్‌ నుంచి బయటకు వస్తున్న డాక్టర్‌ సుధాకర్‌

నడిరోడ్డుపై కారు ఆపి డాక్టర్‌ సుధాకర్‌ హంగామా

చొక్కా విప్పి పోలీసులపై బూతుపురాణం 

మద్యం మత్తులో ఉన్నట్టు అనుమానం 

కేజీహెచ్‌కు తరలించిన పోలీసులు 

సాక్షి, అమరావతి/విశాఖపట్నం/సీతమ్మధార (ఉత్తర): నర్సీపట్నం అనస్థీషియా (మత్తు) వైద్యుడు సుధాకర్‌ మరోసారి వీరంగమాడారు. జాతీయ రహదారిపై కారు ఆపి నానా హంగామా సృష్టించారు. పోలీసులు చెప్పిన వివరాల మేరకు.. నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో మత్తు డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తూ ఇటీవల సస్పెన్షన్‌కు గురైన డాక్టర్‌ సుధాకర్‌ శనివారం సాయంత్రం మర్రిపాలెం నుంచి బాలయ్యశాస్త్రి లేఅవుట్‌లోని తన ఇంటికి వెళుతున్నారు. మార్గంమధ్యలో పోర్టు ఆస్పత్రి వద్ద జాతీయ రహదారిపై తన కారాపి స్థానికులను, ఆటో డ్రైవర్లను దుర్భాషలాడటం ప్రారంభించారు. దీంతో వారు 100కు ఫోన్‌ చేయడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు.

సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వినకుండా వారిపై తిరగబడ్డాడు. చొక్కా విప్పి నడిరోడ్డుపై పడుకుని పోలీసుల్ని, స్థానికుల్ని, ప్రజాప్రతినిధుల్ని నోటికొచ్చినట్టు తిట్టడం ప్రారంభించారు. డాక్టర్‌ ప్రవర్తనను వీడియో తీస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ రమణ చేతిలోంచి సెల్‌ను లాక్కుని రోడ్డుకేసి కొట్టారు. వైద్యుడిని అదుపు చేసేందుకు పోలీసులు అతని చేతులను తాళ్లతో కట్టారు. మద్యం మత్తులో ఉన్నట్టు అనుమానించి ఎమ్‌ఎల్‌సీ చేయించడం కోసం కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ రక్త నమూనాలు సేకరించి వైద్యులు రిఫర్‌ చేయడంతో ప్రభుత్వ మానసిక వైద్యశాలకు తరలించినట్టు ఈస్ట్‌ ఏసీపీ కులశేఖర్‌ చెప్పారు. వైద్యుడిపై 353 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశామని, డాక్టర్‌ను లాఠీతో కొట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేసినట్టు సీపీ ఆర్‌కే మీనా చెప్పారు. 

నిందితులను అరెస్ట్‌ చేయాలి: చంద్రబాబు
విశాఖపట్నంలో డాక్టర్‌ సుధాకర్‌పై జరిగిన దాడి.. దళితులపై దాడి, వైద్య వృత్తిపై దాడి అని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్‌ చేయాలని కోరారు. 

మరిన్ని వార్తలు