కాసేపట్లో రైలు వస్తుందని అనౌన్స్‌మెంట్‌ ఇంతలోనే..

15 Dec, 2019 08:31 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: రేణిగుంట రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు ధర్నాకు దిగారు. యశ్వంత్‌పూర్ నుంచి హౌరా వెళ్ళవలసిన అంగా ఎక్స్‌ప్రెస్‌ రైలును అధికారులు చెప్పపెట్టకుండా రద్దు చేయడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు.  మరికొద్దిసేపట్లో అంగా ఎక్స్‌ప్రెస్‌ మూడో నంబర్ ప్లాట్‌ఫాం మీదకు వస్తుందని అనౌన్స్ చేయడంతో ప్రయాణికులంతా ఫ్లాట్‌ఫాం మీదకు వచ్చి రైలు కోసం వేచిచూశారు. చాలాసేపు వేచిచూసినా రైలు రాకపోవడంతో వారు ఆందోళన చెందారు. ఇంతలో అంగా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినట్టు అనౌన్స్‌మెంట్‌ వచ్చింది. దీంతో ఆ రైల్లో వెళ్లేందుకు టికెట్లు, రిజర్వేషన్లు చేయించుకున్న దాదాపు 500 మంది ప్రయాణికులు షాక్‌ తిన్నారు. ఇంత దారుణమైన నిర్లక్ష్యమా? అంటూ ఆందోళనకు దిగారు. స్టేషన్ మాస్టర్ గది వద్ద ధర్నా చేపట్టారు. కనీసం రైలు రద్దయిన సమాచారాన్ని కూడా తమకు చెప్పకపోవడం దారుణమని ప్రయాణికులు మండిపడుతున్నారు. రాత్రి సమయంలో చిన్న, చిన్నపిల్లలతో ఉన్న మహిళలు తమ రైలు రద్దు కావడంతో స్టేషన్‌లో చిక్కుకుపోవాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ మహిళలు పిల్లలతో కలిసి ధర్నా చేశారు.

మరిన్ని వార్తలు