కలెక్టరేట్ ఎదుట అంగన్‌వాడీల ధర్నా

21 Nov, 2015 01:36 IST|Sakshi

 ఏలూరు (మెట్రో) : జీతాలు పెంచినట్టు ఆగస్టు నెలలో ప్రకటించినప్పటికీ నేటికీ చెల్లించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందని అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా శాఖ అధ్యక్షురాలు పి.హైమావతి ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన జీతాలను తక్షణమే చెల్లించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా హైమావతి మాట్లాడుతూ పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో అంగన్‌వాడీల జీతాలు పెంచి వెంటనే అమలు చేస్తున్నారన్నారు.

ఏపీ ప్రభుత్వం మాత్రం జీతాల ఊసే ఎత్తడం లేదన్నారు. సీఐటీయూ నాయకుడు చింతకాయల బాబూరావు మాట్లాడుతూ సమస్యలపై పోరాడుతున్న ఉద్యోగులను, కార్మికులను పట్టించుకోకుండా పాలకులు విదేశీ పర్యటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పర్యటన పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. సీఐటీయూ ఏలూరు నగర శాఖ ప్రధాన కార్యదర్శి పి.కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు