ప్రీ స్కూల్‌తో న్యూ లుక్‌

17 Jun, 2017 09:51 IST|Sakshi
ప్రీ స్కూల్‌తో న్యూ లుక్‌

► అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త కళ
► కాన్వెంట్లను తలపిస్తున్న కేంద్రాలు


ఒంగోలు టౌన్‌: ప్రీ స్కూల్‌తో అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త కళ వచ్చింది. ఇప్పటి వరకూ అరకొరగా ఇరుకు గదుల్లో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలు నూతన శోభను సంతరించుకున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి అంగన్‌వాడీ కేంద్రాల్లో కాన్వెంట్‌ విద్యను అందించాలన్న ఉద్దేశంతో కేంద్రాల రూపు రేఖలను మార్చేస్తున్నారు. ప్రైవేట్‌ కాన్వెంట్లకు మాదిరిగా కేంద్రాల్లోని తరగతి గదులకు రకరకాల రంగులు వేయడంతో వాటికి న్యూ లుక్‌ వస్తోంది. జిల్లాలోని ఒంగోలు, చీరాల, కందుకూరు, మార్కాపురం అర్బన్‌ ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలు ప్రీ స్కూల్‌తో రకరకాల రంగులతో ముస్తాబు అవుతున్నాయి.

ప్రీ స్కూల్‌లో చిన్నారులు అడుగు పెట్టిన వెంటనే ఇంగ్లిష్‌ లెటర్లు, ఆ లెటర్లకు సంబంధించిన పదాలు, వాటికి సంబంధించిన బొమ్మలతో తరగతి గదులను చక్కగా తయారు చేస్తున్నారు. అంతేగాకుండా రకరకాల బొమ్మలు, పక్షులు, బెలూన్లకు సంబంధించిన పెయింటింగ్‌లను వేయిస్తున్నారు. మూడేళ్ల నుంచి ఐదేళ్లలోపు చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాలకు రప్పించాలన్న ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి చిన్నారుల తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన రాబట్టుకునేందుకు ఐసీడీఎస్‌ అధికారులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో తొలి విడతగా అర్బన్‌ ప్రాంతాల్లో ప్రీ స్కూల్‌ ద్వారా కాన్వెంట్‌ విద్యను అందించాలని నిర్ణయించారు.

అందులో భాగంగా ఒంగోలు అర్బన్‌ ప్రాంతంలోని 171 అంగన్‌వాడీ కేంద్రాలు, చీరాల అర్బన్‌ ప్రాంతంలోని 90 అంగన్‌వాడీ కేంద్రాలు, మార్కాపురం అర్బన్‌ ప్రాంతంలోని 80 అంగన్‌వాడీ కేంద్రాలు, కందుకూరు అర్బన్‌ ప్రాంతంలోని 60 అంగన్‌వాడీ కేంద్రాల్లో తొలిసారిగా నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యను చిన్నారులకు అందించనున్నారు. ఇందుకు అర్బన్‌ ప్రాంతాల వారీగా సంబంధిత అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణ తరగతులు కూడా ప్రారంభించారు. ఒంగోలు అర్బన్‌ ప్రాంత పరిధిలోని 171 అంగన్‌వాడీ కార్యకర్తలకు శుక్రవారంతో శిక్షణ తరగతులు ముగిశాయి. జిల్లా స్థాయిలో ప్రీ స్కూల్స్‌ ట్రైనింగ్‌ కన్సల్టెంట్‌గా సండ్ర భాగ్యలక్ష్మిని నియమించారు. ఆమె పర్యవేక్షణలో శిక్షణ తరగతులు జరుగుతున్నాయి.

దశలవారీగా విస్తరణ
ప్రీ స్కూల్‌ను దశలవారీగా విస్తరించాలన్న ఆలోచనలో మహిళా శిశుసంక్షేమశాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. ప్రస్తుతం అర్బన్‌ ప్రాంతాల్లో అమలు చేయనున్న కాన్వెంట్‌ విద్య ద్వారా వచ్చే ఫలితాల ఆధారంగా రూరల్‌ ప్రాంతాల్లో కూడా అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అర్బన్‌ ప్రాంతాల్లోని ప్రీ స్కూల్స్‌ నిర్వహణకు సంబంధించిన బాధ్యతలను సంబంధిత మునిసిపల్‌ అధికారులు చూస్తున్నారు. రూరల్‌ ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలను సంబంధిత మండల అధికారులకు బాధ్యతలను అప్పగించి వాటిని మరింత ఆకర్షవంతంగా తీర్చిదిద్ది ఎక్కువ శాతం చిన్నారులను కాన్వెంట్ల వైపు కాకుండా ప్లే స్కూల్స్‌గా మారుతున్న అంగన్‌వాడీ కేంద్రాలకు రప్పించేందుకు చర్యలు చేపట్టారు.

జిల్లాకు తొలి విడతగా 4900 పుస్తకాలు
అర్బన్‌ ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్స్‌గా మార్చేసి కాన్వెంట్‌ విద్యను అందించనున్న నేపథ్యంలో వాటికి సంబంధించి జిల్లాకు తొలి విడతగా 4900 పుస్తకాలు వచ్చాయి. వీటిలో నర్సరీకి సంబంధించి 1400, ఎల్‌కేజీకి సంబంధించి 2200, యూకేజీకి సంబంధించి 1300 పుస్తకాలు ఉన్నాయి. అర్బన్‌ ప్రాంతాల వారీగా ప్రీ స్కూల్స్‌ ఎన్ని ఉన్నాయి, వాటిలో ఎంతమంది చిన్నారులు చేరే అవకాశం ఉందన్న అంచనాతో తొలి విడతగా జిల్లాకు 4900 పుస్తకాలు వచ్చాయి. అయితే ప్రీ స్కూల్స్‌లో చేరే పిల్లల సంఖ్య పెరిగే కొద్దీ అదనంగా మరిన్ని పుస్తకాల కోసం మహిళా శిశు సంక్షేమశాఖ ఉన్నతాధికారులకు ఇండెంట్‌ పెట్టేందుకు కూడా అధికారులు చర్యలు చేపట్టారు.     

మరిన్ని వార్తలు