కూలిన అంగన్‌వాడీ కేంద్రం పైకప్పు

5 Apr, 2018 12:59 IST|Sakshi
శిథిలావస్థలో ఉన్న అంగన్‌వాడీ భవనం

తల్లీబిడ్డలకు గాయాలు

శిథిల భవనంలో   కేంద్రం నిర్వహణ

ఐసీడీఎస్‌ సిబ్బందితీరుపై సర్వత్రా విమర్శలు

పోలాకి: చిన్నారులుండే కేంద్రమది. గర్భిణులు, బాలింతలు కూడా అక్కడికి వస్తుంటారు. ఏదైనా చిన్న పొరపాటు జరిగినా ఊహించని పరిణామాలు ఎదురవుతుంటాయి. వీటిని లెక్కచేయని అధికారులు, కిందిస్థాయి సిబ్బంది వీటిని పట్టించుకోలేదు. వీరి నిర్లక్ష్యం కారణంగా  దీర్ఘాశి గ్రామంలో బుధవారం కలకలం రేగింది. అంగన్‌వాడీ భవనం పైకప్పు కూలిన ఘటనలో తల్లీబిడ్డలు గాయాలతో  బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. కొన్నెళ్ల క్రితం హెల్త్‌ సెంటర్‌ కోసం నిర్మించిన శిథిల భవనంలో ధీర్ఘాశి–2 అంగన్‌వాడీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఈ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఏడాది క్రితం కూలగొట్టి నూతన భవనాన్ని నిర్మించేందుకు ప్రతిపాదించారు.

అయితే కేంద్రాన్ని ప్రస్తుతం అందులోనే నిర్వహిస్తున్నారు.  రోజులాగానే బుధవారం కూడా కేంద్రానికి 12 మంది చిన్నారులు వచ్చారు. అలాగే నెలవారీ చికిత్సలకు వచ్చే వారికి సేవలందించేందుకు  హెల్త్‌సిబ్బంది హాజరయ్యారు. కేంద్రం పరిధిలోని బాలింతలు, గర్భిణులతో పాటు చిన్నారుల తల్లులు కూడా వచ్చారు. ఇదే సమయంలో ఒక్క సారిగా భవనం పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో అందులో ఉన్నవారంతా భయంతో బయటకు పరుగులు తీశారు. భవనం పెచ్చులూడిపడిన ఘటనలో దండాశి పార్వతి, ఆమె రెండున్నరేళ్ల కుమారుడు భరత్‌చంద్ర గాయాలపాలయ్యారు. వీరిద్దరినీ 108 వాహనంలో నరసన్నపేట సామాజిక ఆస్పత్రికి తరలించారు. కాగా అంగన్‌వాడీ కేంద్రం భవనం పెచ్చులూడి ఇద్దరు గాయపడినప్పటికీ ఐసీడీఎస్‌ అధికారుల దృష్టికి విషయం చేరలేదు. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నరసన్నపేట ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పీవో అనంతలక్ష్మి దృష్టికి ‘సాక్షి’ ప్రమాద విషయాన్ని తీసుకెళ్లగా.. ఆమె కూడా ఘటనపై సమాచారం లేదన్నారు.

మరిన్ని వార్తలు