చుట్టపుచూపుగా అంగన్‌వాడీ కేంద్రానికి..

19 Sep, 2019 11:21 IST|Sakshi

కాట్రాయపాడు అంగన్‌వాడీ కేంద్రాన్ని పట్టించుకోని కార్యకర్త

టీడీపీ నాయకుల అండతో ఎనిమిదేళ్లుగా ఇదే తంతు

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడంతో గ్రామస్తుల ఫిర్యాదు

సాక్షి, కావలి: దగదర్తి మండలంలోని కాట్రాయపాడు గ్రామంలోని మెయిన్‌ అంగన్‌వాడీ కేంద్రంలో కార్యకర్తగా పని చేస్తున్న పి.మాలతి ఎనిమిదేళ్లుగా గ్రామంలో నివాసం ఉండటం లేదు. దీంతో ఆమె అంగన్‌వాడీ కేంద్రానికి చుట్టపుచూపుగా వీలు కుదురినప్పుడు వస్తుండటంతో గ్రామస్తులు మండిపడుతున్నారు. గత 18 ఏళ్ల నుంచి అంగన్‌వాడీ కార్యకర్తగా పని చేస్తున్న మాలతి, ఎనిమిదేళ్ల క్రితం నెల్లూరుకు వెళ్లిపోయారు. ఆమె కుటుంబం నెల్లూరు నగరానికి వెళ్లిపోవడంతో, కాట్రాయపాడు గ్రామంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చి విధులు నిర్వర్తిచడానికి ఆమెకు వీలు కుదురడం లేదు.

ఎప్పుడో ఒకసారి మాత్రమే..!
వాస్తవంగా ఉదయం 9 గంటలు నుంచి సాయంత్రం 4 గంటలు వరకు అంగన్‌వాడీ కేంద్రంలో ఉండి పిల్లలకు, బాలింతలకు, గర్భిణులకు ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని అందించాలి. అలాగే వారి ఆరోగ్య పరిస్థితులను గమనిస్తుండాలి. పిల్లలకు ఆటలతో పాటు అక్షరాలు నేర్పుతూ మానసిక వికాసానికి తోడ్పడాలి. అయితే నెల్లూరు నగరం నుంచి దగదర్తి మండలలలోని కాట్రాయపాడు గ్రామానికి రావడానికి రోజూ రావడానికి సదరు కార్యకర్తకు సాధ్యపడటం లేదు. దీంతో అప్పుడప్పుడు ఉదయం 11 గంటలకు అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చి, మధ్యాహ్నం 2 గంటలకు నెల్లూరుకు వెళ్లే బస్సు ఎక్కి వెళ్లిపోతుంది. ఆమె పనితీరు ప్రభుత్వ లక్ష్యాన్ని వెక్కిరిస్తున్నట్లుగా ఉన్న విషయం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులకు తెలిసినప్పటికీ, టీడీపీ నాయకుల అండ ఉండటంతో ఆమెపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి అప్పట్లో భయపడ్డారు. దీనిని అలుసుగా తీసుకొనే అంగన్‌వాడీ కార్యకర్త ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది.

అధికారులకు గ్రామస్తుల ఫిర్యాదు
గ్రామస్తులు ఆమె ద్వారా ప్రభుత్వ సేవలు అందకుండా పోతుండటంతో పాటు ఆమె వ్యవహారశైలిపై తీవ్రమైన ఆగ్రహంతో కాట్రాయపాడు గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం బుచ్చిరెడ్డిపాలెం సీడీపీవో జియోన్‌కుమారి, దగదర్తి సూపర్‌వైజర్‌ ఎన్‌.సునీతలు గ్రామంలో విచారణకు వచ్చారు. అప్పుడు కూడా కార్యకర్త మాలతి అంగన్‌వాడీ కేంద్రంలో లేరు. అయితే ఆమెకు ఫోన్‌ చేసి రావాల్సిందిగా సీడీపీవో చెప్పారు. ఆమె హడావుడిగా నెల్లూరులో బయలుదేరి కాట్రాయపాడు గ్రామానికి చేరుకొనేలాగా, ఆమెకు మద్దతుగా గ్రామంలోని టీడీపీ నాయకులు అంగన్‌వాడీ కేంద్రానికి చేరుకొన్నారు. దీంతో సీడీపీవో, సూపర్‌వైజర్‌లు విస్తుపోయారు. శాఖాపరమైన విచారణకు టీడీపీ నాయకులు అంగన్‌వాడీ కేంద్రానికి రావడం ఏమిటని విస్మయం వ్యక్తం చేశారు. నివేదికను జిల్లా అధికారులకు అందజేస్తామని సీడీపీవో చెప్పారు. 
అంగన్‌వాడీ కేంద్రంలో విచారిస్తున్న సీడీపీవో. అక్కడే కుర్చీలో కూర్చొన్న టీడీపీ నాయకులు 

మరిన్ని వార్తలు