‘అంగన్‌వాడీ’ల్లో పౌష్టికాహారం పక్కదారి

19 Jul, 2014 02:43 IST|Sakshi

ఉదయగిరి: అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు అందాల్సిన పౌష్టికాహారం పక్కదారి పడుతోంది. పేదలు ఉపయోగించే ఈ ఆహారం పక్కదారి పట్టించడంలో ఆ శాఖ సిబ్బంది, అధికారుల పాత్ర ఉందనే విమర్శలున్నాయి. కార్యకర్తల నుంచి కొంతమంది సూపర్‌వైజర్లు అందినకాడికి దండుకుని నల్లబజారుకు తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మామూళ్లు, సరుకులు ఇవ్వని కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తున్నారు. దీనికితోడు అంగన్‌వాడీ కేంద్రం అద్దె, కట్టెల, అమృతహస్తం, రవాణాభత్యం బిల్లుల్లోకూడా అంగన్‌వాడీల నుంచి కమీషన్లు వసూలుచేస్తున్నారు. కేవలం అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే సరుకుల ద్వారానే స్వాహాచేస్తున్న సొమ్ము నెలకు కోటిరూపాయలకు పైగా ఉందంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో 3,774 అంగన్‌వాడీ కేంద్రాల్లో 3,400 మంది కార్యకర్తలు పని చేస్తున్నారు. వారితోపాటు మరో 3,100మంది ఆయాలు ఉన్నారు.

ఈ అంగన్‌వాడీల పరిధిలో 2.27 లక్షల మంది పిల్లలు, 26 వేలమంది బాలింతలు, మరో 28,500 మంది గర్భిణులున్నారు. వీరికి ప్రభుత్వం పౌష్టికాహారంతోపాటు, పాలు, గుడ్డు, బియ్యం, పప్పుదినుసులు అందజేస్తోంది. కొన్ని కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. అంగన్‌వాడీలకు వెళ్లే చిన్నారులకు పప్పుతో కూడిన అన్నం, కోడిగుడ్డు అందిస్తున్నారు. సాయంత్రం అల్పాహారంగా గుగ్గిళ్లు, వడియాలు పెడుతున్నారు.  సూపర్‌వైజర్లను పర్యవేక్షకులుగా ప్రభుత్వం నియమించింది. వీరిలో కొంతమంది సూపర్‌వైజర్లు అవినీతికి పాల్పడుతూ అంగన్‌వాడీల నుంచి పప్పు, బియ్యం, కోడిగుడ్లు, నూనె, పౌష్టికాహారం తీసుకుని నల్ల బజార్లకు తరలిస్తూ పెద్ద మొత్తంలో గడిస్తున్నారు. పైగా ఈ అవినీతి సొమ్ము తమకు ఒక్కరికే కాదని కింది స్థాయి నుంచి జిల్లా స్థాయివరకు అందించాలని బుకాయిస్తున్నారు.
 
 బిల్లుల్లోనూ స్వాహా..
 అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు రవాణాభత్యం, కేంద్రాల అద్దె, వంటచెరకు బిల్లులకు సంబంధించి అధికారులు కమీషన్లు వసూలు చేస్తున్నారు. ఒక్క జీతంలో తప్ప మిగతా అన్నింటిలోను వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇదేమిటని అడిగిన కార్యకర్తలపై వేధింపులకు పాల్పడుతున్నారు. వీటితోపాటు అమృతహస్తం పథకం కోసం ఇచ్చే కూరగాయలు, పాలబిల్లుల్లో కూడా తమకు కమీషన్లు ఇవ్వాలని కొంత మంది సూపర్‌వైజర్లు పట్టుబడుతున్నారు. దీనిని సహించలేని కొంతమంది కార్యకర్తలు సంబంధిత సూపర్‌వైజర్లపై పై అధికారులకు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. ఇటీవల వరికుంటపాడు మండలంలోని ఓ సూపర్‌వైజర్ వసూళ్ల దందాను నిరసిస్తూ నేరుగా ఆ ప్రాజెక్టు సీడీపీఓకు ఫిర్యాదు చేశారు.
 
 సరుకులు పక్కదారిపట్టిస్తే చర్యలుతప్పవు
 చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు అందించే సరుకులు పక్కదారి పట్టించే వారిపై చర్యలు తప్పవు. దీనికి ఎవరు బాధ్యులైనా విచారించి తగు చర్యలు తీసుకుంటాం.   
 వెంకటసుబ్బమ్మ, సీడీపీఓ ఉదయగిరి
 

మరిన్ని వార్తలు