ఊడ్చిపారేస్తాం

27 Feb, 2014 03:09 IST|Sakshi
ఊడ్చిపారేస్తాం

 బద్వేలు అర్బన్,
 అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకుండా వారిని విస్మరిస్తున్న ఈ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఊడ్చిపారేస్తామని అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ బద్వేలు, గోపవరం మండలాల నాయకురాళ్లు, సత్యవతి, సుభాషిణి, హుసేనమ్మలు హెచ్చరించారు. 

 

బుధవారం అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో  పట్టణంలో చీపుర్లతో రోడ్లు ఊడుస్తూ  నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతోప్రస్తుతం అందుతున్న వేతనాలు తమకు ఏమాత్రం సరిపోవడం లేదని, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.   ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటి సభ్యుడు వీరశేఖర్, పట్టణ కార్యదర్శి బాలు, డీవైఎఫ్‌ఐ పట్టణ కన్వీనర్ చిన్ని పాల్గొన్నారు.
 

 పోరుమామిళ్లలో...

 

 అంగన్‌వాడీలపై పోలీసులు లాఠీచార్జీ చేసి, అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ బుధవారం స్థానిక ఆర్టీసీ బస్టాండువద్ద మోకాళ్లపై నిలబడి అంగన్‌వాడీ కార్యకర్తలు నిరసన తెలిపారు. ముందుగా సీఐటీయూ కార్యాలయం నుంచి ర్యాలీగా నినాదాలు చేసుకుంటూ బస్టాండువద్దకు వచ్చి మోకాళ్లపై కూర్చున్నారు. సీఐటీయూ నాయకుడు భైరవప్రసాద్, అంగన్‌వాడీ యూనియన్ నేతలు మేరి, రమాదేవి, వినోదాదేవి, విజయరేణుకలు మాట్లాడుతూ కనీసవేతనం రూ. 10 వేలు ఇవ్వాలని, 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని కోరితే ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
 

 బి.కోడూరులో...
 

తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించేంతవరకు పోరాటం ఆగదని అంగన్‌వాడీ అధ్యక్షురాళ్లు శోభాదేవి, లలితమ్మలు అన్నారు. హైదరాబాద్‌లో అంగన్‌వాడీలపై జరిగిన లాఠీచార్జీని నిరసిస్తూ బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో తహసీల్దారు కార్యాలయాన్ని ముట్టడించారు.   ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్‌వాడీల సమస్యలపై ప్రభుత్వం ఎందుకంత  చిన్నచూపు చూస్తుందో అర్థం కావడం లేదన్నారు.   అంతకు ముందు  తహసీల్దారు కార్యాలయం వద్ద చీపుర్లతో వీధులు ఊడ్చి తమ నిరసనను తెలిపారు.
 

మరిన్ని వార్తలు