ఎప్పుడూ అండగా ఉంటాం- మంత్రి అనిల్‌కుమార్‌

9 Jul, 2019 09:28 IST|Sakshi
పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులను పంపిణీ చేస్తున్న మంత్రి పోలుబోయిన అనిల్‌కుమార్, రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రూప్‌కుమార్‌

పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి పోలుబోయిన అనిల్‌కుమార్‌ భరోసా

మంత్రి సొంత నిధులతో కార్మికులకు భోజనాల ఏర్పాటు, దుస్తుల పంపిణీ

కార్మికులతో కలిసి భోజనం చేసిన మంత్రి అనిల్‌

సాక్షి, నెల్లూరు సిటీ: ప్రతిపక్షంలో మీ సమస్యల పరిష్కార పోరాటంలో అండగా ఉన్నాం.. అధికారపక్షంలోనూ మీ సమస్యలను మా సమస్యలుగా భావించి పరిష్కరించి తోడుంటామని రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి సొంత నిధులతో భోజనాలు, దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్‌ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో తనపై పోటీ చేసిన వ్యక్తి వందల కోట్లు ఖర్చు చేసినా, మీ అందరి ఆశీస్సులతో గెలిచానని గుర్తుచేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత కార్మికుల జీతాలు రూ.12 వేల నుంచి రూ.18వేలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

రూ.6వేలు లెక్కన జీతాలు పెంచితే ప్రభుత్వంపై భారం పడుతుందని కొందరు అధికారులు జగన్‌ వద్ద ప్రస్తావించిగా ఆయన మాత్రం కార్మికులు చేసే పని ఇంకెవరూ చేయలేరని, వారికి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అన్నారని తెలిపారు. అలాంటి ముఖ్యమంత్రి వద్ద మంత్రిగా పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ కార్మికులకు నిత్యం అండగా ఉంటామన్నారు. ఐదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్మికుల సమస్యల పై పోరాటం చేశామన్నారు. అధికారంలోకి వచ్చినా కార్మికులకు తోడుంటామని చెప్పారు. 

279 జీఓను ప్రభుత్వం రద్దు చేసింది
కార్మికులను ప్రైవేటీకరణ చేసేందుకు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 279జీఓను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రద్దు చేశారని మంత్రి అనిల్‌ తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి నెలా సమయానికి జీతాలు చెల్లింపులు జరిగేలా చూస్తామన్నారు. ఆ తర్వాతే ఇతర అభివృద్ధి పనులకు చెల్లింపులు జరుగుతాయన్నారు. నెల్లూరును పరిశుభ్రంగా ఉంచేందుకు మీ సహకారం ఇవ్వాలని కోరారు. మీరు పని చేసే ఎనిమిది గంటలు కష్టపడాలన్నారు. మీకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నాకు పెద్ద బాధ్యత అప్పగించారని, మంత్రిగా ఎక్కువ సమయం నెల్లూరులో ఉండలేకపోయినా నెలలో వారం, పది రోజులు అందుబాటులో ఉండేలా సమయం కేటాయిస్తానని హామీ ఇచ్చారు. మీకు ఏ సమస్య వచ్చినా డైరెక్టగా నా దృష్టికి తీసుకుని రావచ్చని తెలిపారు. 

మంత్రి సొంత నిధులతో కార్మికులకు భోజనాలు
నెల్లూరు చరిత్రలో ఇప్పటి వరకు ఏ మంత్రి కూడా కార్మికులకు సొంత నిధులతో భోజనాలు ఏర్పాటు చేసి, దుస్తులు పంపిణీ చేసిన పరిస్థితి లేదు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్‌ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్‌ తన సొంత నిధులు ఖర్చు చేసి సోమవారం పారిశుద్ధ్య కార్మికులు మొత్తం 1,500 మందికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. కార్మికులందరికీ దుస్తులు పంపిణీ చేశారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి మంత్రి అనిల్‌ భోజనం చేశారు.

ఈ క్రమంలో అక్కడే ఉన్న కార్మికులు ఎవరూ తమతో కలిసి భోజనం చేయలేదని, తమకు బట్టలు పెట్టి మా మంచి కోరుకుంటున్న అనిల్‌కుమార్‌ నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆశీస్సులు అందించారు. కొందరు కార్మికులు కంటతడిపెట్టారు. కార్యక్రమంలో డిప్యూటీ మాజీ మేయర్‌ ముక్కాల ద్వారకానాథ్, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పి.రూప్‌కుమార్‌యాదవ్, నాయకులు ఆనం రంగమయూర్‌రెడ్డి, గోగుల నాగరాజు, ఎండీ ఖలీల్‌అహ్మద్, వేలూరు మహేష్, నూనె మల్లికార్జున్‌యాదవ్, కుంచాల శ్రీనివాసులు వందవాశి రంగా పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు