ప్రభుత్వ నిర్ణయం మేరకే శ్రీవారి దర్శనం

30 Apr, 2020 10:08 IST|Sakshi

టీటీడీ ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడి

సాక్షి, తిరుమల: మే 3 తరువాత లాక్‌డౌన్‌ ముగియనున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని టీటీడీ ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. బుధవారం రాత్రి శ్రీవారి ఏకాంత సేవలో ఆయన పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. మే 3 తరువాత టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి శ్రీవారి దర్శనానికి సంబంధించిన సమాచారాన్ని అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు.

అలాగే, తిరుమలలో మే 1 నుంచి 3వ తేదీ వరకు నిర్వహించతలపెట్టిన శ్రీపద్మావతి పరిణయోత్సవాలను వాయిదా వేసినట్లు చెప్పారు. ఈ ఉత్సవానికి కనీసం 70 మంది అవసరం పడుతుందని,సామాజిక దూరం పాటించాల్సిన ప్రస్తుత సమయంలో ఇది కష్టతరమన్నారు. శార్వరి నామ సంవత్సరంలో ఎప్పుడైనా ఈ ఉత్సవాలను నిర్వహించుకునే అవకాశం ఉన్నందున తదుపరి భక్తులందరి సమక్షంలోనే ఉత్సవాలను నారాయణగిరిలో వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు