శ్రీశైలం జలాశయానికి ముప్పులేదు

22 Nov, 2019 05:58 IST|Sakshi

ఎలాంటి పగుళ్లు కూడా లేవు.. 

జలవనరుల శాఖా మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌

సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం జలాశయం భద్రతకు ఎలాంటి ముప్పులేదని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌ స్పష్టంచేశారు. జలాశయం నిర్వహణపై నిర్లక్ష్యం అంటూ ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు చేస్తున్నదుష్ప్రచారాన్నిగురువారం ఆయన ఖండించారు. జలాశయం ఆనకట్టకు ఎలాంటి పగుళ్లూలేవని తెలిపారు. ఏటా జరిపే జలాశయం నిర్వహణ పనుల్లో భాగంగా ఈ ఏడాది ‘అండర్‌ వాటర్‌ వీడియోగ్రఫీ’ పనులను గోవాకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ (ఎన్‌ఐఓ)కు.. బ్యాతిమెట్రిక్‌ సర్వే పనులను విశాఖ ఎన్‌ఐఓకు అప్పగించామన్నారు.

ఈ సంస్థల ప్రతినిధులతో అక్టోబర్‌ 29న శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు చర్చించారని చెప్పారు. ఆ రెండు సంస్థలు ఇచ్చే నివేదికలను సీడబ్ల్యూసీ రిటైర్డ్‌ చైర్మన్‌ ఏబీ పాండ్య అధ్యక్షతన ఏర్పాటుచేసిన డ్యామ్‌ సేఫ్టీ కమిటీకి పంపుతామని.. ఆ కమిటీ చేసిన సూచనల మేరకు నిర్వహణ పనులు చేపడతామన్నారు. సీపేజీ పనులను శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు ఎప్పటికప్పుడు చేపడుతున్నారన్నారు. కాగా, శ్రీశైలం డ్యామ్‌ భద్రతకు ఎలాంటి ప్రమాదంలేదని సూపరింటెండెంట్‌ ఇంజినీరు చంద్రశేఖరరావు కూడా అన్నారు. వాటర్‌మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా, డాక్టర్‌ రాజేంద్రసింగ్‌ మంగళవారం చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమన్నారు.  

మరిన్ని వార్తలు