వాళ్లు నవయుగతో తేల్చుకుంటారు: అనిల్‌కుమార్‌

1 Nov, 2019 12:16 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : అనుకున్న సమయానికల్లా పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖా మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. నవంబర్ 1 తేదీ నుంచి పనులు ప్రారంభిస్తామని చెప్పినట్లుగానే శుక్రవారం నుంచి పోలవరం పనులు మొదలు కానున్నాయని హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని... తమ ప్రభుత్వ సంకల్పం మంచిది కాబట్టే తమకు అనుకూలంగా హైకోర్టు తీర్పు వెలువడిందన్నారు. పోలవరం జల విద్యుత్‌ ప్రాజెక్టు(పీహెచ్‌ఈపీ) పనులను థర్డ్‌ పార్టీకి అప్పగించేందుకు అడ్డుగా ఉన్న ఉత్తర్వులను హైకోర్టు తొలగించిన విషయం తెలిసిందే. రివర్స్‌ టెండరింగ్‌ కింద ఆగస్టులో జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ప్రాజెక్టు పనులను థర్డ్‌ పార్టీకి అప్పగించే ప్రక్రియను మొదలుపెట్టరాదని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను గురువారం ఎత్తి వేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి పోలవరం ప్రాజెక్టు పనులు మొదలు కానున్నాయి.(చదవండి : పోలవరం జలవిద్యుత్‌ ప్రాజెక్టు పనుల అప్పగింతకు హైకోర్టు ఓకే)

ఈ సందర్భంగా మంత్రి అనిల్‌ యాదవ్‌ మాట్లాడుతూ... రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా పోలవరం ప్రాజెక్టులో ప్రభుత్వ ఖజానాకు రూ. 800 కోట్లు మిగిలాయని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుత తీర్పు నేపథ్యంలో టీడీపీ నేతలు కోర్టును కూడా తప్పుపడతారేమోనంటూ చురకలు అంటించారు. ‘70 శాతం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేశామని చంద్రబాబు అబద్దాలు చెపుతున్నారు. 2018 కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని దేవినేని ఉమా సవాల్ చేశారు. మాట తప్పడం అనేది చంద్రబాబుకు అలవాటు. తమ వారికి కాంట్రాక్టులు కట్టబెట్టడం.. వారి దగ్గర నుంచి కమీషన్లు తీసుకోవడం చేశారు. ఇప్పుడు పోలవరం సబ్ కాంట్రాక్టర్లుకు సమస్యలు ఏమైనా ఉంటే వాళ్లు నవయుగతో తేల్చుకుంటారు అని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబులా మాట తప్పే నైజం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి లేదని.. అనుకున్న సమయానికల్లా ప్రాజెక్టు పనులు పూర్తవుతాయన్నారు. ‘పోలవరం పనులు ఆగిపోతాయని ప్రతిపక్ష పార్టీలు కలలు గన్నాయి. 86 శాతం రిజర్వేయర్లు పూర్తిగా నీటితో నిండాయి. ఆర్ అండ్ ఆర్‌ను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించిన పోలవరం ప్రాజెక్టును భగవంతుడి ఆశీసులతో సీఎం జగన్‌ పూర్తి చేస్తారు’ అని వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు