ఎన్నార్సీపై ఎప్పుడైనా బాబు నోరు తెరిచాడా?

8 Mar, 2020 13:00 IST|Sakshi
శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌

మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌

సాక్షి, నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ప్రజల్లో అనేక సందేహాలున్న ఎన్నార్సీపై ఎప్పుడైనా చంద్రబాబు నోరు తెరిచి మాట్లాడాడా..? అని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ ప్రశ్నించారు. నగరంలోని మూలాపేటలో శనివారం మంత్రి పర్యటించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. శంబడి వారితోట , రాజారామమోహన్‌రాయ్‌ పార్కుసెంటర్లలో రూ.3.62కోట్లతో నిర్మిస్తున్న సీసీరోడ్లు, డ్రెయిన్లు, కల్వర్టులకు సంబంధించి శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  కేంద్రం అమలు చేసిన ఎన్నార్సీ, ఎన్‌ఆర్పీలు దేశంలోని ముస్లింల్లో అభద్రతా భావాన్ని నెలకొల్పొయన్నారు. రాష్ట్రంలోని ముస్లింలు ఆందోళన చెందుతున్న క్రమంలో ఎన్నార్సీ, ఎన్‌పీఆర్‌పై ఒక్కమాట కూడా చంద్రబాబు మాట్లాడకపోవడం సిగ్గు చేటన్నారు. తమ నాయకుడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఈ అంశంపై క్యాబినెట్‌లో తీర్మానం చేశారన్నారు.

ఈ నెల 20న అసెంబ్లీలో ఎన్నార్సీకి వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నారని తెలిపారు. చంద్రబాబునాయుడు, టీడీపీ నాయకులు ఎవరైనా ఈ అంశంపై నోరు విప్పారా అని నిలదీశారు. అమరావతి, ఆస్తులపై మాట్లాడుతున్న టీడీపీ నాయకులు ముస్లింలను భయాందోళనలకు గురిచేస్తున్న అంశాలపై ఎందుకు మాట్లాడటం లేదో సమాధానం చెప్పి తీరాలన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై మతాలను అడ్డుపెట్టుకుని రెచ్చగొట్టే పనులను టీడీపీ నాయకులు మానుకోవాలని హితవుపలికారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోనే వైఎస్సార్సీపీ 151 సీట్లు గెలిచిందన్నారు. అలాంటి వారికి ఇబ్బందులు కలిగితే స్పందించని మనస్తత్వం సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి లేదన్నారు. ఏ పార్టీకి అండగా ఉండాలో ఇప్పటికైనా కొందరు ముస్లింలు తెలుసుకోవాలన్నారు. కార్పొరేషన్‌ పరిధిలో 14వ ఆర్థిక సంఘం నిధులతో పూర్తి స్థాయిలో రోడ్లు, డ్రెయిన్లు నిర్మిస్తున్నామన్నారు. త్వరలో మరికొన్ని పనులను ప్రారంభించి పూర్తి చేస్తామన్నారు.

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పార్టీలకతీతంగా అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు. ఉగాది నాడు రాష్ట్రంలోని 26 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందజేసే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. కార్పొరేషన్‌ పరిధిలో 17వేల మందికి నివేశన స్థలాలు ఇస్తున్నామన్నారు.  నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికలపై కొందరు టీడీపీ నాయకులు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారన్నారు. టీడీపీకి ఓట్లు వేసే ఆలోచన ప్రజలకు ఉంటే స్టే తెచ్చుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. చిత్తు, చిత్తుగా ఓడిపోతామనే భయంతోనే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సత్తా చాటుతుందన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు కొండ్రెడ్డి రంగారెడ్డి, చాట్ల నరసింహారావు, నూనె మల్లికార్జునయాదవ్,  దార్ల వెంకటేశ్వర్లు, మిద్దె మురళీ కృష్ణయాదవ్, వేలూరు మహేష్,  అల్లంపాటి జనార్దన్‌రెడ్డి, తాటిపర్తి సునీల్, జంగాల కిరణ్‌ కుమార్,సీహెచ్‌ కుమార్, సుదీర్‌(చిట్టి), లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కిన్నెర ప్రసాద్, ధనుంజయ, కిన్నెర ప్రసాద్, గంగరాజుయాదవ్, గోగుల నాగరాజు, వడ్లమూడి చంద్ర, తాటిపర్తి సునీల్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు