-

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం

26 Sep, 2019 13:26 IST|Sakshi
జిల్లా అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి అనిల్, తదితరులు

నెల్లూరు(వేదాయపాళెం): రాష్ట్ర ప్రభుత్వం పారదర్శక ఇసుక పాలసీని తీసుకొచ్చిందని, నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా జరిగితే ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌కుమార్‌యాదవ్‌ ఆదేశించారు. జిల్లాలో ఇసుక సరఫరాపై మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్, ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి నగరంలోని పినాకినీ అతిథిగృహంలో రెవెన్యూ, పోలీస్, విజిలెన్స్, ఇరిగేషన్, మైనింగ్‌ అధికారులతో బుధవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఇసుకను అక్రమంగా తరలించకూడదని, ఇసుక పాలసీ పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దాదాపు రెండు నెలలు కసరత్తు చేసి ఇసుక పాలసీని తీసుకొచ్చారని వివరించారు. వరదల కారణంగా కృష్ణా, గోదావరి బేసిన్లలో ఇసుకను తీసుకునే అవకాశాలు తగ్గాయన్నారు. నెల్లూరులో ఇసుక కోసం కొంత ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవమేనని, రాష్ట్రవ్యాప్తంగా ఒకే యాప్‌ నడుస్తుండటంతో ఎవరైతే ఇసుక కోసం ఆన్‌లైన్లో అప్లయ్‌ చేసుకున్నారో వారికే దక్కుతోందని వివరించారు. దీంతో ఇసుక బయటి ప్రాంతాలకు తరలివెళ్తోందని, నెల్లూరులో కొంత తక్కువగా లభిస్తున్న విషయాన్ని గుర్తించామని తెలిపారు.

భవిష్యత్తులో కొత్తకోడూరు, స్వర్ణముఖి వంటి రీచ్‌లను గుర్తించి, జిల్లాలో ఇసుక కొరత లేకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తే ఉక్కుపాదం మోపాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఉదంతాల్లో రాజకీయ ఒత్తిళ్లు ఉండవని కలెక్టర్, ఎస్పీకి చెప్పామన్నారు. ఇసుక రీచ్‌లలో నిఘాను పెంచేందుకు సీపీ కెమెరాలను అమర్చనున్నామని తెలిపారు. ఇసుక అక్రమంగా తరలిపోకుండా జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని, అధికారులు పరిశీలిస్తారని వివరించారు. త్వరలో మరికొన్ని రీచ్‌లను ప్రారంభించి, ఎలాంటి ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అనంతరం నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడారు. మీ సేవలో నో స్టాక్‌ బోర్డులు దర్శనమిస్తూ.. ఇసుక రీచ్‌ల వద్దకు వెళ్తే వందలాది లారీలు, ట్రాక్టర్లలో పక్క జిల్లాలు, రాష్ట్రాలకు ఇసుక తరలివెళ్తోందని, జిల్లాకు మాత్రం అందని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ క్రమంలో సీఎం ఆదేశాలతో మంత్రి అనిల్‌ ప్రత్యేక చొరవ తీసుకొని సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారని పేర్కొన్నారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కలెక్టర్‌ శేషగిరిబాబు, ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు కొండ్రెడ్డి రంగారెడ్డి, కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, రూప్‌కుమార్‌యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు