తగ్గిన వానలు... పెరిగిన చలిగాలులు...

19 Dec, 2018 06:55 IST|Sakshi

జిల్లాలో గణనీయంగా పడిపోయిన ఉష్టోగ్రతలు

చలిగాలికి పాల్తేరులో మృతి చెందిన వృద్ధురాలు

పెద్ద సంఖ్యలో మృత్యువాత పడిన మూగజీవాలు

విజయనగరం గంటస్తంభం: పెథాయ్‌ తుఫాన్‌ తీరం దాటినా... చలిగాలులు మాత్రం గణనీయంగా పెరిగాయి. ఫలితంగా ఉష్టోగ్రతలు తగ్గడంతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్‌ తుఫాన్‌ సోమవారం కాకినాడ వద్ద ఒకసారి, తుని వద్ద రెండోసారి తీరందాటిన విషయం తెలిసిందే. ఈ ప్రభావం వల్ల జిల్లాలో ఆదివారం ఆర్ధరాత్రి నుంచి మొదలైన వర్షాలు సోమవారం తీవ్రరూపం దాల్చి ఆర్ధరాత్రి వరకు పడ్డాయి. తర్వాత తగ్గుముఖం పట్టి మంగళవారం ఉదయానికి ఆగాయి. తర్వాత వాతావరణం పూర్తిగా మారి వెలుతురు వచ్చింది. అయితే సాయంత్రం మాత్రం మళ్లీ గాలి చినుకులు, చిరుజల్లులు జిల్లాలో చాలాచోట్ల పడ్డాయి.

8.7సెంటీమీటర్ల వర్షపాతం
తుఫాన్‌ మూలంగా జిల్లాలో ఏకంగా 8.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 16వ తేదీ రాత్రి నుంచి వర్షాలు పడటంతో17వ తేదీ ఉదయం 8.30 గంటల వరకు 3 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. 17వ తేదీ ఉదయం నుంచి 18వ తేదీ ఉదయం వరకు కురిసిన వర్షాలకు 84.1 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. మొత్తానికి ఏకధాటిగా 87.1మిల్లీమీటర్లు(8.7సెంటీమీటర్లు) వర్షపాతం నమోదు కావడంతో జలం పొంగింది. సెప్టెంబర్‌ నెల నుంచి జిల్లాలో సరైన వర్షాలు లేవు. దీంతో భూగర్భజలాలు కూడా కిందకు పడిపోయాయి. ఈ పరిస్థితుల్లో వర్షాలు పడ్డం జిల్లా ప్రజల కు ఉపశమనం కలిగించే అంశమే. వేసవిలో కొన్నాళ్లపాటు తాగునీటి ఇబ్బందులు తీరే అవకాశం ఉంది.

చలిగాలులతో ఇబ్బంది
తుఫాన్‌ తీరం దాటినా చలిగాలులతో జిల్లా ప్రజలు అవస్థలు పడుతున్నారు. మంగళవారం ఉదయం చెప్పుకోదగ్గ వర్షాలు జిల్లాలో లేవు. గాలి చినుకులు మాదిరిగా తుంపర్లు పడుతున్నాయి. మరోవైపు ఈదురుగాలుల వాడి తగ్గింది. అయినా చలిమాత్రం పంజా విసురుతోంది. ఉష్టోగ్రతలు ఏకంగా పడిపోయాయి. మంగళవారం ఉదయం జిల్లాలో 21, 20, 19 డిగ్రీలు ఉష్టోగ్రతలు నమోదు కావడం విశేషం. దీంతో చల్లని గాలులు వీయడంతో ఇంట్లో ఉన్నా దుప్పటి కప్పుకోవాల్సి వచ్చింది. లేకుంటే గజగజ వణకుతున్నారు. మరోవైపు ఇంటి బయటకు వస్తే నరకమే. స్వెట్టర్ల, మంకీ క్యాప్‌లతో చెవులు, ఒళ్లంతా కప్పినా చలిమాత్రం కాయడం లేదు. దీంతో బయటకు రావడానికే జనం భయపడ్డారు. వృద్ధులు, పిల్లల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చలికి తట్టుకోలేక బాడంగి మండలం పాల్తేరులో వృద్ధురాలు వంగపండు పారమ్మ(82)మృతి చెందారు. సోమవారం, మంగళవారం చలిగాలులకు గొర్రెలు, మేకలు, పశువులు మృతి చెందాయని రైతులతోపాటు అధికారులు చెబుతున్నారు. దీన్ని బట్టి చలి తీవ్రత ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. పెథాయ్‌ తుఫాన్‌ ఇంకా సముద్రంలో కొనసాగుతోందనీ, ఒడిశా వైపు వెళుతుందని అధికారులు చెబుతున్నారు. అక్కడ తీరం దాటే వరకు చలిగాలులు తప్పవని చెబుతుండడంతో జిల్లా వాసులు అందోళన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు