ఏడు మూగజీవాల మృత్యువాత

30 Mar, 2019 13:35 IST|Sakshi
మృతి చెందిన ఎద్దు , తాగి వదిలేసిన మద్యం బాటిళ్లు

మరో 20 పశువుల ఆరోగ్య పరిస్థితి విషమం

ప్లాస్టిక్‌ వ్యర్థాలు, పారబోసిన పాడైపోయిన ఆహార పదార్థాలు తిన్న ఎద్దులు

27న లోకేష్‌ ఎన్నికల ప్రచారం రోజున వదిలేసిన వ్యర్థాలతో అనర్థం  

విశాఖపట్నం  ,పాడేరు రూరల్‌/హుకుంపేట : టీడీపీ నాయకుల నిర్లక్ష్యం కారణంగా ఏడు మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. ప్లాస్టిక్‌ వ్యర్థాలు, వృథాగా పడేసిన పాడైపోయిన ఆహార పదార్థాలు తిని   ఏడు దుక్కిటెడ్లు మృతి చెందగా, మరో 20  జీవాల ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది.  ఈ నెల 27న   మంత్రి లోకేష్‌ హుకుంపేట, పాడేరుల్లో ఎన్నికల ప్రచారానికి వచ్చారు.స్థానిక టీడీపీ అభ్యర్థులు లోకేష్‌ హాజరయ్యే సభలకు పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల నుంచి జనాలను తరలించారు. ఈ జనానికి పాడేరు, పెదబయలు, హుకుంపేట మండలాల సరిహద్దు గంపరాయి బ్రిడ్జి సమీపంలో మైదానం వద్ద వంటలు ఏర్పాటు చేశారు. కొంతమంది మద్యం సేవించారు. విందు భోజనాల అనంతరం ప్లాస్టిక్‌ వ్యర్థాలు, మద్యం బాటిళ్ల, తిని పడేసిన ఆహార పదార్థాలను అక్కడే పడేసి వెళ్లిపోయారు. 28న హుకుంపేట మండలం మఠం కొత్తూరు, పెదబయలు మండలం గంపరాయి ప్రాంతం నుంచి మూగ జీవాలు మైదానం వైపుగా వెళ్లాయి.  పాడైపోయిన ఆహార పదార్థాలు, ప్లాస్టిక్‌ వ్యర్థాలను   తిన్నాయి.

దీంతో మఠం కొత్తూరు, గంపరాయి గ్రామాలకు చెందిన కొర్ర దొన్నుకు చెందిన  రెండు దుక్కిటెడ్లు, కొర్రా అప్పారావుకి చెందిన ఒకటి, కొర్రా అర్జున్‌కు చెందిన ఒకటి, గెమ్మెలి అప్పారావుకు చెందిన ఒకటి, కొర్రా ధర్మయ్యకు చెందిన ఒకటి, కొర్రా బలరాంకు   చెందిన ఒక ఎద్దు    శుక్రవారం   మృతి చెందాయి.మరో 20 ఎద్దులు తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి.  వేలాది రూపాయలు అప్పులు చేసి కొనుగోలు చేసిన దుక్కిటెద్దులు మృతి చెందడంతో తీవ్రంగా నష్టపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.  టీడీపీ అభ్యర్థులు స్పందించి తగిన నష్టపరిహారం చెల్లించాలని బాధితులు కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు