ఫిర్యాదు చేశామని ఇప్పుడు గుర్తొచ్చామా?

9 Jul, 2019 10:40 IST|Sakshi
చెందుర్తిలో యానిమేటర్‌లను నిలదీస్తున్న గ్రామస్తులు

చెందుర్తిలో యానిమేటర్లను అడ్డుకున్న గ్రామస్తులు

బయటపడ్డ చెందుర్తి యానిమేటర్‌ అవకతవకలు

తప్పు చేసిన యానిమేటర్‌కు వత్తాసు పలికిన మిగిలిన యానిమేటర్లు

నిలదీసిన డ్వాక్రా సంఘాల మహిళలు

గొల్లప్రోలు (పిఠాపురం): గత ప్రభుత్వంలో టీడీపీ నాయకులు అండ చూసుకుని అక్రమాలకు, అవకతవకలకు పాల్పడిన చెందుర్తి గ్రామానికి చెందిన  యానిమేటర్‌ మాచవరపు పద్మకు ఆమెతో పనిచేస్తున్న మిగిలిన యానిమేటర్లు సంఘీభావం తెలపడం వివాదాస్పదంగా మారింది. యానిమేటర్‌ పద్మ చెందుర్తి గ్రామంలో పలు మహిళా సంఘాలకు చెందిన పసుపు–కుంకుమ నిధులు, స్కాలర్‌ షిప్పులు భారీ ఎత్తున స్వాహా చేసినట్లు గ్రామస్తులు ఎమ్మెల్యే దొరబాబుకు, డీఆర్‌డీఏ పీడీ మధుసూదనరావులకు  ఫిర్యాదు చేశారు. దీంతో యానిమేటర్‌ పద్మ అవకతవకలు బయటపడడంతో మిగిలిన యానిమేటర్లు ఆమె తప్పును కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 32 మంది యానిమేటర్లు రెండు ఆటోలపై చెందుర్తి గ్రామానికి చేరుకున్నారు. యానిమేటర్‌ పద్మపై ఫిర్యాదు చేసిన డ్వాక్రా సంఘాల వద్దకు వెళ్లి ‘‘తప్పు జరిగిపోయింది.. మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం. ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని కోరారు.

దీంతో విషయం తెలుసుకున్న పలువురు మహిళా సంఘాల సభ్యులు, స్కాలర్‌షిప్పు బాధితులు యానిమేటర్‌లను నిలదీశారు. ఫిర్యాదు చేశామని ఇప్పుడు గుర్తొచ్చామా? అని ప్రశ్నించారు. ఇన్నాళ్లు టీడీపీ నాయకుల అండ చూసుకుని ఎవరికి చెప్పుకుంటారో.. ఏమి చేసుకుంటారో అని ఇష్టాను సారంగా మాట్లాడేవారన్నారు. ఇప్పుడు చేసిన అవకతవకలు బయట పడుతున్నాయనే ఉద్దేశంతో ఉద్యోగాలు పోతాయని ఇప్పుడు గుర్తుకు వచ్చామా? అని బాధితులు వాసా వెంకయమ్మ, చీకట్ల కుమారి, ద్రోణం చిన్ని, బండి ప్రసాద్, నక్కా కృష్ణ తదితరులు నిలదీసారు. పరిస్థితి బయటకు పొక్కడంతో యానిమేటర్లు వెంటనే ఆటోలపై గ్రామం విడిచి వెళ్లిపోయారు.  

మరిన్ని వార్తలు