నీలినీడలు

29 Oct, 2017 11:13 IST|Sakshi

మండపేట: గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో ఆర్భాటంగా ప్రారంభించిన ‘అన్న అమృతహస్తం’ పథకానికి ప్రభుత్వం చెయ్యిస్తోంది. పథకం ప్రారంభించి మూడు నెలలైనా అమలుకు ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. అయినప్పటికీ అప్పోసొప్పో చేసి వండివార్చిన అంగన్‌వాడీ కార్యకర్తలు.. సుమారు రూ.84 లక్షల మేర బిల్లు బకాయిలు పేరుకుపోవడంతో ఇక తమవల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారు. పాత బకాయిలు విడుదల చేయాలని కోరుతూ వారు ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ పథకం అమలుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

పథకం ప్రారంభమైందిలా..
ఏజెన్సీలోని ఎనిమిదింటితోపాటు కోరుకొండ, శంఖవరం, తుని ప్రాజెక్టుల పరిధిలో చిన్నారులకు మాదిరిగానే బాలింతలు, గర్భిణులకు కూడా ఆయా కేంద్రాల్లోనే పౌష్టికాహారం వండి వడ్డిస్తుండగా.. మిగిలిన ప్రాజెక్టుల పరిధిలో గర్భిణులు, బాలింతలకు వారానికి నాలుగు గుడ్లు, నెలకు మూడు కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, అరలీటరు నూనె చొప్పున పంపిణీ చేసేవారు. ఇంటికి ఇవ్వడం వలన బాలింతలు, గర్భిణులకు పూర్తిస్థాయిలో పౌష్టికాహారం అందడం లేదని గుర్తించి మిగిలిన ప్రాజెక్టుల మాదిరి గా అంగన్‌వాడీ కేంద్రాల్లోనే వండి వడ్డించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదనంగా పాలు పంపిణీ చేయాలని కూడా ఆదేశాలిచ్చింది. ఈ మేరకు కాకినాడ, రాజమహేంద్రవరం, తాళ్లరేవు, కపిలేశ్వరపురం, కోనసీమ తదితర ప్రాంతాల్లోని 17 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో ఉన్న 3,934 అంగన్‌వాడీ కేంద్రాల్లో ‘అన్న అమృతహస్తం’ పథకం ప్రారంభించారు.

మెనూ ఇచ్చారు.. నిధులు మరిచారు!
ఆయా ప్రాజెక్టుల పరిధిలోని 30,544 మంది గర్భిణులు, 25,539 మంది బాలింతలకు ఈ పథకం కింద పౌష్టికాహారం అందించనున్నట్టు ప్రకటించారు. రోజూ అన్నం, గుడ్డు, పాలతోపాటు వారంలో రెండు రోజులు పప్పు, కూరగాయలతో చేసిన కూర, రెండు రోజులు సాంబారు, రెండు రోజులు ఆకుకూర పప్పు వండి పెట్టాలని మెనూ విడుదల చేశారు. బియ్యం, నూనె రేషన్‌ ద్వారా అందిస్తుండగా.. కూరగాయల ఖర్చు నిమిత్తం ఒక్కొక్కరికి రోజుకు రూ.1.40, పోపు సామగ్రి కోసం 40 పైసల చొప్పున రూ.1.90 అందించనున్నట్టు ప్రకటించారు. పంచాయతీల ద్వారా వంట సామగ్రి సమకూర్చనున్నట్టు అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. 

జూలై ఒకటో తేదీన ఈ పథకాన్ని ప్రారంభించగా ఇప్పటికీ ఆయా కేంద్రాలకు వంట సామగ్రి, గర్భిణులు, బాలింతలు కూర్చునేందుకు వీలుగా కుర్చీలు, టేబుళ్లను అందజేయలేదు. పైగా నిధుల కేటాయింపు కూడా లేదు. అధికారుల ఒత్తిళ్లతో మూడు నెలలుగా అంగన్‌వాడీ కార్యకర్తలు అప్పులు చేసి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటివరకూ ఈ పథకం అమలుకు జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు సుమారు రూ.84 లక్షలు మేర బిల్లులు విడుదల కావాల్సి ఉంది. నెలలు గడుస్తున్నా బిల్లులు విడుదల కాకపోవడంతో పథకం అమలు చేయలేక అంగన్‌వాడీ కార్యకర్తలు చేతులెత్తేస్తున్నారు. సర్కారు వైఖరితో గర్భిణులు, బాలింతలకు రేషన్‌ నిలిచిపోగా, పౌష్టికాహారం అందని దుస్థితి నెలకొంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు