మందుబాబులకు భలే మంచి చౌకబేరం!

25 Jun, 2018 11:11 IST|Sakshi
బార్‌ పక్కనే నిర్మిస్తున్న అన్న క్యాంటిన్‌

బార్‌ పక్కనే అన్న క్యాంటీన్‌ ఏర్పాటుపై విమర్శలు

సైడ్‌ డ్రెయిన్‌పై చప్టా ఏర్పాటు

ప్రజావసరాలను అనుగుణంగా పాలకులు పాలన చేయాలి. అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. పేదలు నివసించే ప్రాంతాల్లో తక్కువ ధరకే భోజనం అందించేందుకు ప్రభుత్వం రూపొందించిన అన్నక్యాంటీన్లను పేదలు లేని ప్రాంతాల్లో ఏర్పాటుచేసి పథక లక్ష్యాలను విస్మరిస్తున్నారు. భవానీపురం ఆర్టీసీ వర్క్‌షాపు రోడ్డులో ఓ బార్‌ పక్కన ఏర్పాటుచేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

భవానీపురం: ‘భలే మాంచి చౌక బేరం..మించినన్‌ దొరకదూ...’ మందుబాబులారా త్వరపడండి అన్నటుగా ఉంది త్వరలో ప్రారంభించనున్న అన్న క్యాంటీన్‌ను చూస్తుంటే. బార్‌లో తాగి హోటల్‌కెళ్లి తినాలంటే చాలా ఎక్కువైపోతుంది. ఎంచక్కా బార్‌ పక్కనే అన్న ఎన్టీఆర్‌ పేరుతో ఏర్పాటుచేస్తున్న క్యాంటీన్‌కు వెళ్లి ఐదు రూపాయలకే శుభ్రంగా లాగించేయవచ్చు. మందు ఎక్కువై అడుగులు తడబడి అన్న క్యాంటీన్‌ ముందున్న అవుట్‌ఫాల్‌ డ్రెయిన్‌లో పడిపోతామన్న భయం లేదు. డ్రెయిన్‌పై బారున చప్టా కట్టేశారు. మందు ఎక్కువైతే దానిపైనే ఓ కునుకు తీయవచ్చు. ఇదీ గట్టు వెనుక ప్రాంతం విద్యాధరపురం ఆర్టీసీ వర్క్‌షాప్‌ రోడ్డులో ప్రారంభానికి సిద్ధం అవుతున్న అన్న క్యాంటీన్‌పై స్ధానికులు వేస్తున్న చలోక్తులు.

తమిళనాడులో అమ్మ క్యాంటీన్ల తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోకూడా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదలకు నామమాత్రపు ధరకు టిఫిన్, భోజనం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఉద్దేశ్యం మంచిదే అయినా క్యాంటీన్‌ ఏర్పాటుకు గట్టు వెనుక ప్రాంతంలో ఎన్నుకున్న ప్రదేశాలపైనే విమర్శలు వస్తున్నాయి. ఐరన్‌ యార్డ్, హోల్‌సేల్‌ కమర్షియల్‌ కాంప్లెక్స్‌ వంటి ప్రదేశాలలో అయితే అక్కడి ముఠా కూలీలు, ఇతర ప్రాంతాల నుంచి సరుకు కొనుగోలు చేసేందుకు వచ్చే వినియోగదారులు, చిరువ్యాపారులకు సదుపాయంగా ఉంటుంది. గొల్లపూడి బైపాస్‌ రహదారిపై అయితే ఆ మార్గంలో  ప్రయాణించేవారికి హోటల్స్‌ లేవు కాబట్టి వారికి సదుపాయంగా ఉంటుంది. అంతేగానీ ఖాళీగా స్థలాలు ఉన్నాయి కదా అని ఉపయోగం లేని ప్రదేశాలలో ఏర్పాటు చేయడమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఆర్టీసీ వర్క్‌షాప్‌ రోడ్డులో పోలీస్‌ కాలనీ లేఅవుట్‌లో కామన్‌ సైట్‌ (కాలనీవాసుల ప్రయోజనార్థం)గా వదిలిన ప్రదేశంలో క్యాంటీన్‌ ఏర్పాటుపై తొలుత కాలనీవాసులు అభ్యంతారాలు వ్యక్తం చేశారు. ఓపెన్‌ సైట్‌లపై తమకు అధికారం ఉందని నగరపాలక సంస్థ అధికారులు వారి అభ్యంతరాలను పక్కన పెట్టి యుద్ధప్రాతిపదికన క్యాంటీన్‌ నిర్మిస్తున్నారు. పైగా ఒక బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ పక్కనే నిర్మించడంపై బార్‌లో పూటుగా తాగి పక్కనే ఉన్న క్యాంటీన్‌లో ఏదో ఒకటి తినేయవచ్చని స్థానికులు జోకులు వేసుకుంటున్నారు. రెస్టారెంట్‌లో తినేందుకు అయ్యే ఖర్చుతో అదనంగా మరికొంత మద్యం సేవించి క్యాంటీన్‌లో తక్కువ ఖర్చుతో భోజనం చేయవచ్చని మందుబాబులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఆర్టీసీ వర్క్‌షాప్, టైర్‌షాప్, డిపోలు ఉన్నప్పటికీ వారికి లోపల క్యాంటీన్లు ఉండటంతో వారు ఇక్కడికి వచ్చే అవకాశం లేదు. నివాసాలు, గోడౌన్‌లు, దుకాణాలు ఉన్న ఈ రోడ్డులో వారెవరూ అన్న క్యాంటీన్‌కు వచ్చే అవకాశం లేదు. భవానీపురం హౌసింగ్‌బోర్డు కాలనీలోని పెన్షనర్స్‌ అసోసియేషన్‌ హాల్‌ పక్కన మరొక క్యాంటీన్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇక్కడికికూడా ప్రజలు వచ్చే అవకాశం లేదు.

లక్షలాది రూపాయల ప్రజాధనం వృథా
ఆర్టీసీ వర్క్‌షాప్‌ రోడ్డులో రూ.30 లక్షల వ్యయంతో చేపట్టిన నిర్మాణాన్ని ప్రభుత్వం ఎల్‌ అండ్‌ టి సంస్థకు అప్పగించింది. అయితే క్యాంటీన్‌ చుట్టూ ప్రహరి, క్యాంటీన్‌ ముందున్న అవుట్‌ఫాల్‌ డ్రెయిన్‌పై శ్లాబ్‌తో ఫుట్‌పాత్‌ నిర్మాణాన్ని నగరపాలక సంస్థకు అప్పగించింది. భారీ అవుట్‌ఫాల్‌ డ్రెయిన్‌పై దాదాపు వంద మీటర్లకుపైగా శ్లాబ్‌ వేసి ఫుట్‌పాత్‌గా తయారుచేశారు. దీనిని లక్షలాది రూపాయల ప్రజాధనంతో ఏర్పాటు చేయడమేమిటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలనీల్లో అభివృద్ధి పనులు చేయమంటే కార్పొరేషన్‌ అప్పుల్లో ఉందని మొత్తుకునే మేయర్‌ కోనేరు శ్రీధర్, అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు ఇవి కనిపించవా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు