నగరానికే అన్న క్యాంటీన్లు

12 Jul, 2018 09:50 IST|Sakshi
చిట్టివలస వద్ద ప్రారంభించిన  అన్న క్యాంటీన్‌లో భోజనం రుచి చూస్తున్న  మంత్రి గంటా, కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒకటైన అన్న క్యాంటీన్లను ఎట్టకేలకు ప్రారంభించారు. జీవీఎంసీ పరిధిలో 25 క్యాంటీన్లు మంజూరు కాగా.. తొలివిడతలో 13 క్యాంటీన్లకు శ్రీకారం చుట్టారు. గ్రామీణ జిల్లాలో ఒక్కటి ఏర్పాటు చేయలేదు. అర్బన్‌ ప్రాంతాల్లోనే క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించిన ప్రభుత్వం.. గ్రామీణ జిల్లాలో పలు అవసరాల నిమిత్తం చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రతి రోజు వేలాది మంది వచ్చే నర్సీపట్నం, యలమంచలి, పాయకరావుపేట వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని డిమాండ్‌ ఉన్నప్పటికీ ఒక్కటి కూడా మంజూరు చేయలేదు. జీవీఎంసీ పరిధిలో చిట్టివలస వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. క్యాంటీన్‌లోనే మంత్రి గంటా, కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌లు భోజనం చేశారు. మిగిలిన   ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యేలు ఈ  అన్న క్యాంటీన్లను అట్టహాసంగా ప్రారంభించారు.

తొలిరోజు ఉచితం..
తొలిరోజు అన్న క్యాంటీన్‌ ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చిన వారందరికీ ఉచితంగానే అల్పాహారం, భోజనం పెట్టారు. తొలిరోజు దాదాపు క్యాంటీన్లంటినీ 2 గంటలకే క్లోజ్‌ చేశారు. దీంతో 2 గంటల తర్వాత వచ్చిన వారు భోజనం లభించకపోవడంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. నగర పరిధిలో విమ్స్, ఎంవీపీ, ఆర్‌ఈ హెచ్, నమ్మిదొడ్డి, చినగంట్యాడ, శ్రీహరిపురం, ములగాడ, మర్రిపాలెం, చిట్టివలస, అనకాపల్లి ఆస్పత్రి, టర్నర్‌ చౌల్ట్రీ, ఫ్రూట్‌ మార్కెట్, వాంబే కాలనీ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారు.

మూడుపూటల నాణ్యమైన ఆహారం..
రూ.15కే మూడుపూటలా నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసినట్టు మంత్రి గంటా తెలిపారు. చిట్టివలస వద్ద క్యాంటీన్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రికి భోజనం సదుపాయం కల్పించేందుకు రోజుకు రూ.63వరకూ ఖర్చవుతుందని, ఈ మొత్తం లో ప్రభుత్వం రూ.58 రాయితీగా భరిస్తూ కేవలం రూ.15కే సామాన్యులకు రుచికరమైన ఆహారాన్ని అందిస్తోందన్నారు.

జిల్లాలో ఈ క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను అక్షయపాత్ర ఫౌండేషన్‌కు అప్పగించామని చెప్పా రు. ప్రాథమికంగా ప్రతి క్యాంటీన్‌లో పూటకు 350 మందికి భోజన సదుపాయాలు కల్పించామని, డిమాండ్‌ను బట్టి వెయ్యి మంది వరకూ కల్పిం చేందుకు చర్యలు చేపడతామన్నారు. ఆదివారం మినహా వారానికి ఆరు రోజులు ఈ క్యాంటీన్లు పనిచేస్తాయని పేర్కొన్నారు. ఉదయం 7.30 నుం చి 10 గంటల వరకూ మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకూ, రాత్రి 7.30నుంచి 9 గంటలవరకూ ఈ క్యాంటీన్లు పనిచేస్తాయన్నారు. ఫేషియల్‌ రికగ్నేషన్‌ద్వారా ప్రతివ్యక్తికి ఒక టోకెన్‌ మాత్రమే విక్రయిస్తారని తెలిపా రు. ప్రతి క్యాంటీన్‌లో ఆర్‌వో ప్లాంట్లను కూడా ఏర్పాటు చేశామన్నారు.

మరిన్ని వార్తలు