టోపీ ఉంటే టోకెన్‌ ఇవ్వం

29 Aug, 2018 03:53 IST|Sakshi

అన్న క్యాంటీన్‌లో నిరుపేద ముస్లిం గెంటివేత

నరసరావుపేట టౌన్‌: ‘నారా హమారా–టీడీపీ హమారా’ పేరుతో ఎన్నికల వేళ ఓట్ల కోసం సభలు నిర్వహిస్తున్న చంద్రబాబు సర్కారు నిజ స్వరూపం తేటతెల్లమైంది. ఆయన పాలనలో ముస్లింలు ఎదుర్కొంటున్న వివక్ష మరోసారి బయటపడింది. నమాజ్‌ చేసే టోపీ ధరిస్తే అన్న క్యాంటీన్‌లో భోజనం పెట్టబోమంటూ వృద్ధుడైన ఓ నిరుపేద ముస్లింను గెంటివేయడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఐదు పూటలా నమాజ్‌ చేస్తానన్న గాలిబ్‌..
గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పెదతురకపాలెం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త గాలిబ్‌సాహెబ్‌ రెండు రోజుల క్రితం భోజనం చేసేందుకు సత్తెనపల్లి రోడ్డులోని కోడెల స్టేడియం వద్ద ఉన్న అన్నక్యాంటీన్‌కు వెళ్లాడు. టోకెన్‌ కోసం క్యూలో నిలబడగా తలపై ఉన్న టోపీని తొలగించాలని కౌంటర్‌లో ఉన్న సిబ్బంది పేర్కొన్నారు.  గాలిబ్‌సాహెబ్‌ ఇందుకు నిరాకరిస్తూ తాను నిత్యం అల్లాను స్మరిస్తూ ఐదు పూటలా నమాజ్‌ చేస్తానని, టోపీ తీయడం సరికాదని బదులిచ్చాడు.

సెల్‌ నంబరు చెప్పాలని సిబ్బంది సూచించగా తాను 70 ఏళ్ల వయసులో రోజువారీ కూలీకి అరటికాయల వ్యాపారం చేస్తుంటానని, తనకు సెల్‌ లేదని, అది ఎలా వాడాలో కూడా తెలియదని తెలిపాడు. అయితే భోజనం టోకెన్‌ ఇచ్చేది లేదంటూ బయటకు వెళ్లాలని క్యాంటీన్‌ నిర్వాహకులు ఆయన్ను ఆదేశించారు. తాను 1983 నుంచి టీడీపీ కార్యకర్తనని, ప్రభుత్వం పేదల కోసం అన్న క్యాంటీన్‌ నిర్వహిస్తుంటే భోజనం పెట్టకుండా ఇబ్బంది పెట్టడం ఏమిటంటూ గాలిబ్‌ సాహెబ్‌ అభ్యంతరం తెలపడంతో సెక్యూరిటీ గార్డును పిలిచి బలవంతంగా గెంటేశారు. గాలిబ్‌సాహెబ్‌ తనకు జరిగిన ఈ అవమానం గురించి విలేకరులకు చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా