ఆర్తులకు అన్నపానీయాలు

14 Oct, 2014 23:50 IST|Sakshi
ఆర్తులకు అన్నపానీయాలు

సాక్షి, గుంటూరు: హుదూద్ తుపాను తాకిడికి ఉత్తరాంధ్రలో సర్వం కోల్పోయిన బాధితుల కోసం ఆహారం, నిత్యవసర సరకులు తరలించేందుకు జిల్లా కలెక్టర్ కాంతి లాల్ దండే ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు ఆదేశాల మేరకు వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం సమావేశమై ఆహారం, పాలు, కూరగాయ లు, నీటిని తరలించేందుకు తగు ఆదేశాలు జారీ చేశారు.

  ఇప్పటికే అక్కడి సహాయ పునరావాస పనుల కోసం వివిధ శాఖల అధికారులతో కూడిన 50 బృందాలు విశాఖ తరలి వెళ్లాయి.

  ఈ నెల 13 ఉదయం మొదటి విడతలో 16 బృందాలు, సాయంత్రం రెండో విడతలో 34 బృందాలను పంపారు. అందులో దాదాపు 400మంది సిబ్బంది ఉన్నారు. వీరికి భోజన ఏర్పాట్లు చేసేందుకు మరో రెండు బృందాలు ప్రత్యేకంగా వెళ్లాయి.

 తరలిన ఆహార పదార్థాలు ..
  13వ తేదీన తొలి విడతలో 35వేల ఆహార ప్యాకెట్లు,, 50వేల మజ్జిగ ప్యాకెట్లు పంపారు. ఐదు లారీల్లో 40 టన్నుల బంగాళ దుంపలు పంపగా మంగళవారం ఉదయానికే ఆ లారీలు విశాఖపట్నం చేరుకున్నాయి.
  ఇంకా ఒక టన్ను కూరగాయలు, 18 వేల లీటర్ల పాలు, 47వేల బిస్కెట్ ప్యాకెట్లు, దాదాపు రెండున్నర లక్షల మంచినీటి ప్యాకెట్లు పంపారు.

  ఇక బుధవారానికి చేరేలా లక్షా 90వేల ఆహార ప్యాకెట్లు, 40వేల లీటర్ల పాలు, 70 టన్నుల కూరగాయలు, 50 మెట్రిక్‌టన్నుల ఉల్లిపాయలు, రెండున్నర లక్షల మంచినీటి ప్యాకెట్లు, ఐదున్నర లక్షల కోడిగుడ్లను విశాఖపట్నానికి పంపారు.
  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు 95 టన్నుల బియ్యాన్ని, అరటి పండ్లు పంపే యత్నం చేస్తున్నారు. దీంతోపాటు గురువారానికి కూడా లక్ష భోజనం ప్యాకెట్లు, రెండు లక్షల వాటర్ ప్యాకెట్లు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
 మత్స్యకారుల గ్రామాల్లో


 నష్టం అంచనాకు ప్రత్యేక బృందాలు..
  హుదూద్ ధాటికి మత్స్యకార ప్రాంతాల్లో జరిగిన నష్టం అంచనా వేసేందుకు వివిధ జిల్లాలకు చెందిన 73 మంది మత్స్యశాఖ అధికారులు వెళ్లారు. దెబ్బతిన్న ఇళ్లు, బోట్లు, రోడ్లు వంటివాటిని పరిశీలించి నష్టాన్ని అక్కడే అంచనా వేయాల్సిందిగా మత్స్యశాఖ కమిషనర్ బసవరాజు నుంచి ఆదేశాలు వచ్చినట్లు ఆ శాఖ గుంటూరు డీడీ బలరామ్ ‘సాక్షి’కి చెప్పారు.
 ఆహార పదార్థాల తరలింపు..ఉత్తరాంధ్రలో హుదూద్ తుపాను బాధితుల కోసం సిద్ధం చేసిన ఆహార పదార్థాలు, నిత్యవసర సరకులను జిల్లా అధికారులు మంగళవారం రాత్రి కలెక్టరేట్ నుంచి విశాఖపట్నానికి పంపారు.


  జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, డీఆర్‌ఓ నాగబాబు, గుంటూరు ఆర్డీఓ భాస్కర నాయుడులు తమ సిబ్బందికి తగు సూచనలు చెప్పి, వాహనాలకు బందోబస్తు ఏర్పాటు చేసి పంపారు. సహకార అధికారి శ్రీకాంత్‌ను సరకుల వెంట పంపారు.
  ఆహార ప్యాకెట్ల తయారీలో జెడ్పీ సీఈవో సుబ్బారావు, డీఆర్‌డీఏ పీడీ ప్రశాంతి విశేష కృషి చేశారు. వాహనాలను డీటీసీ సుందర్ సమకూర్చారు. మార్కెటింగ్ అధికారులు కూరగాయలను సేకరించారు. జిల్లా పరిశ్రమల శాఖ అధికారి అధ్వర్యంలో వాటర్ ప్యాకెట్లను సమకూర్చారు.


  సరకులు సేకరణకు సంబంధించి జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, జేసీ సిహెచ్ శ్రీధర్‌లు ప్రత్యేకంగా మానటరింగ్ చేశారు. వీరికి అన్ని శాఖల అధికారులు తమ వంతు సహకారం అందించారు.
  ఆహార ప్యాకెట్లను గన్నవరం విమానాశ్రయానికి తరలించి అక్కడ నుంచి ప్రత్యేక విమా నాల ద్వారా పంపుతారు. గన్నవరం నుంచి ఆహార ప్యాకెట్లను తరలించే బాధ్యతను డిప్యూటీ కలెక్టర్ శివశంకర్‌కు అప్పజెప్పారు.

మరిన్ని వార్తలు