అన్నవరం ప్రసాదం.. ఇక వంద గ్రాములే!!

3 Mar, 2014 12:18 IST|Sakshi
అన్నవరం ప్రసాదం.. ఇక వంద గ్రాములే!!

రేటు పెంచకుండా పరిమాణంపై వేటు
పాలకవర్గ సమావేశంలో నిర్ణయం
తయారీ వ్యయం పెరుగుదలే కారణమంటున్న అధికారులు

 
సత్యదేవుని ప్రసాదం తయారీ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో రేటు యథాతథంగా ఉంచి ప్రసాదం పరిమాణాన్ని తగ్గించాలని పాలకవర్గ సమావేశంలో నిర్ణయించారు. సత్యదేవునికి 2013- 14 ఆర్థిక సంవత్సరంలో రూ. 60 కోట్ల మేర ఆదాయం లభించింది. దేవస్థానం పాలక మండలి సమావేశం వివరాలను ఈఓ వేంకటేశ్వర్లు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. దేవస్థానంలో వాడే వివిధ దినుసుల ధరలు పెరగడంతో ఏడాదికి రూ. 25 లక్షల మేరకు ఖర్చు పెరిగినట్టు ఆయన వెల్లడించారు. ప్రసాదం తయారీ వ్యయం పెరగడం వల్ల సత్యదేవుని ప్రసాదం ప్యాకెట్ బరువు తగ్గిస్తున్నట్టు ఈఓ తెలిపారు. ప్రస్తుతం 150 గ్రాముల ప్రసాదం ప్యాకెట్ రూ.పది కాగా అదే రేటుకు 100 గ్రాముల ప్రసాదం అందజేయాలని తీర్మానించారన్నారు. అదే విధంగా ప్రస్తుతం 150 గ్రాముల బంగీ ప్రసాదం ప్యాకెట్ ధర రూ. 15 అని, ఇకపై 100 గ్రాముల బంగీ ప్రసాదం రూ.15కు అందజేయాలని పాలకవర్గం తీర్మానించారన్నారు. ఈ తీర్మానాలను దేవాదాయ శాఖ కమిషనర్‌కు పంపుతున్నామని, అక్కడ ఆమోదం పొందాక ఈ మార్పు అమలులోకి వస్తుందన్నారు.
 
ప్రసాదం తయారీలో వినియోగించే నెయ్యి ధర ఆరు నెలల క్రితం కిలో రూ.292 ఉండగా ప్రస్తుతం రూ.377 అయ్యిందన్నారు. గ్యాస్ బండ ప్రస్తుతం రూ.1,250 నుంచి రూ.1,325 మధ్యలో కొనుగోలు చేస్తున్నారు. ఆరు నెలల క్రితంతో పోల్చిచూస్తే దీని ధర కూడా రూ. రెండు వందల  వరకూ పెరిగినట్టు ఆయన తెలిపారు. గోధుమ ధర కిలో రూ. 24, చక్కెర కిలో రూ.29కి కొనుగోలు చేస్తున్నామన్నారు. ఈ ధరలు కూడా భవిష్యత్తు లో పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రసాదం ప్యాకర్లకు గతంలో ఒక ప్యాకెట్‌కు 35 పైసలు ఇచ్చేవారమని, ప్రస్తుతం అది 50 పైసలకు పెంచుతూ దేవాదాయశాఖ కమిషనర్‌కు ప్రతిపాదన పంపామన్నారు.

మరిన్ని వార్తలు