మరో ముగ్గురికి నోటీసులు

25 Jan, 2019 00:54 IST|Sakshi

షర్మిలపై అసత్య ప్రచారం కేసులో జారీ

మొత్తం 15 మందిని విచారించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

సూత్రధారుల్ని గుర్తించేందుకు మరింత లోతుగా దర్యాప్తు   

సాక్షి, హైదరాబాద్‌: దివంగత సీఎం వైఎస్సార్‌ కుమార్తె, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ సోదరి షర్మిలపై సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారంపై నమోదైన కేసులో హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసుకు సంబంధించి ఐదుగురికి నోటీసులు పంపిన పోలీసులు.. గురువారం మరో ముగ్గురికి నోటీసులిచ్చారు. ఈ కేసుకు కీలక ప్రాధాన్యమి స్తున్న విచారణ బృందం సాంకేతికంగా బాధ్యుల్ని పట్టుకునే ప్రయత్నాల్లో ఉంది. దాదాపు 60 యూట్యూబ్‌ లింకులను షర్మిల తన ఫిర్యాదులో పొందుపరిచారు. వీటి ఆధారంగా విచారణ ప్రారంభించిన సైబర్‌క్రైమ్‌ పోలీసులు.. ఆయా యూట్యూబ్‌ ఛానల్స్‌ ఎవరికి చెందినవో తెలుసుకుని విచారణకు పిలుస్తున్నారు. గురువారం వరకు మొత్తం 15 మందిని విచారించారు. వీరిలో కొందరు షేర్‌ చేసిన, పోస్ట్‌ చేసిన విషయాలు అభ్యంతరకరంగా ఉన్నట్లు తేలింది.

ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది మందిని నిందితులుగా గుర్తించారు. వీరికి సీఆర్పీసీ 41(ఏ) సెక్షన్‌ కింద నోటీసులు జారీ చేశారు. అభియోగపత్రాల దాఖలు అనంతరం వీరు కోర్టుకు హాజరై విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు సూత్రధారుల్ని గుర్తించాలంటే ప్రాథమికంగా ఆయా అంశాలతో కూడిన వీడియోలను సృష్టిస్తూ యూట్యూబ్‌లోకి అప్‌లోడ్‌ చేసిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ వివరాలు కోరుతూ యూట్యూబ్‌ యాజమాన్యానికి, గూగుల్‌కు లేఖలు రాశారు. మరోపక్క ఆయా వీడియోలను వీక్షించిన వారు దిగువన చేసిన కామెంట్స్‌లో కొన్ని ఆక్షేపణీయంగా ఉన్నాయి. వీటినీ సీరియస్‌గా తీసుకున్న సైబర్‌క్రైమ్‌ పోలీసులు ఆ సబ్‌స్క్రైబర్స్‌ను గుర్తించే పనిలో పడ్డారు. ఇందుకోసం వారి ఐడీలకు సంబంధించిన లాగిన్, ఐపీ వివరాలు సంపాదించే పనిలో ఉన్నారు. 

మరిన్ని వార్తలు