మరో 47 మంది డిశ్చార్జి

24 May, 2020 04:22 IST|Sakshi

రాష్ట్రంలో 1,804కు చేరిన కోలుకున్న వారి సంఖ్య

కొత్తగా 47 మందికి పాజిటివ్‌.. 2,714కు చేరిన కేసులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ బారిన పడిన వారిలో మరో 47 మంది కోలుకున్నారు. దీంతో కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,804కు చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం విడుదల చేసిన బులెటిన్‌లో ఈ విషయం వెల్లడించింది. దీంతో రికవరీ రేటు 66.47 శాతానికి చేరింది. కాగా, శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు 9,136 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 47 మందికి పాజిటివ్‌ లక్షణాలున్నట్లు నిర్థారణైంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,714కు చేరుకుంది. ఇందులో 153 మంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు ఉన్నారు. కృష్ణా జిల్లాలో ఒక మరణం నమోదు కావడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 56కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 854గా ఉంది.
– ఇన్ఫెక్షన్‌ రేటు    0.93%
– రికవరీ రేటు    66.47%
– మరణాల రేటు    2.06% 

కరోనాను జయించిన ఏడాది చిన్నారి
కర్నూలు(హాస్పిటల్‌): కరోనా మహమ్మారి బారి నుంచి ఏడాది వయస్సున్న చిన్నారి సురక్షితంగా బయటపడ్డాడు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఈ చిన్నారికి రెండు వారాలక్రితం కరోనా పాజిటివ్‌ రావడంతో ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స అనంతరం ఈ చిన్నారి కోలుకున్నాడు. కరోనా మార్గదర్శకాల మేరకు రెండుసార్లు పరీక్షలు నిర్వహించి నెగిటివ్‌ రిపోర్ట్‌ రావడంతో శనివారం డిశ్చార్జ్‌ చేసినట్లు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల(స్టేట్‌ కోవిడ్‌ ఆస్పత్రి) సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జి.నరేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు