మరో హామీ కాపీ!

16 Feb, 2019 05:23 IST|Sakshi

రైతులకు ఉచిత విద్యుత్తు సరఫరా 

9 గంటలకు పెంచుతున్నట్లు ఉత్తర్వులు

ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పకుండా అస్పష్టత

ఏడాదిన్నర క్రితమే ఈ హామీ ఇచ్చిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రైతులకు తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్‌ ఇస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి అధికారంలోకి వచ్చాక ఐదేళ్ల పాటు హామీని అమలు చేయకుండా కాలయాపన చేసిన టీడీపీ సర్కారు రేపో మాపో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానున్న తరుణంలో మరో మోసానికి తెర తీసింది. వ్యవసాయ అవసరాల కోసం రైతులకు ఉచితంగా అందించే కరెంట్‌ సరఫరాను రోజుకు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటలకు పెంచుతున్నట్లు విద్యుత్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ శుక్రవారం రాత్రి పొద్దు పోయాక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని ఎప్పుటి నుంచి అమలు చేస్తారనే విషయాన్ని జీవోలో పేర్కొనలేదు.

ఏడాదిన్నర క్రితమే హామీ ఇచ్చిన జగన్‌
తాము అధికారంలోకి రాగానే రాష్ట్రంలో రైతులందరికీ 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ అందజేస్తామని ఏడాదిన్నర కిత్రమే వైఎస్సార్‌ సీపీ ప్లీనరీ సందర్భంగా ప్రకటించిన నవరత్నాల పథకాల్లో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. 2009 ఎన్నికలకు ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రజలకు కొత్తగా రెండు హామీలు మాత్రమే ఇచ్చి తిరిగి అధికారంలోకి రావడం తెలిసిందే. అప్పట్లో ఆయన ఇచ్చిన రెండు కొత్త హామీల్లో రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌ ఒకటి. అయితే ఎన్నికల అనంతరం అధికారం చేపట్టిన మూడు నెలల వ్యవధిలోనే ఆయన అకాల మరణం చెందడంతో ఆ హామీని అమలు చేయలేకపోయారు. తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్‌ ముఖ్యమంతులు ఆ హామీని నెరవేర్చలేదు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఈమేరకు ఇచ్చిన హామీని కూడా చంద్రబాబు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో తన తండ్రి ఆశయాలను నెరవేర్చాలన్న లక్ష్యంతో 2017 జూలైలో వైఎస్సార్‌ సీపీ ప్లీనరీ సందర్భంగా రైతులకు 9 గంటల పాటు ఉచితంగా విద్యుత్‌ అందిస్తామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ప్రతిపక్ష నేత ప్రకటన చేసిన తర్వాత ఏడాదిన్నర దాని గురించి ఏమాత్రం ఆలోచించని టీడీపీ సర్కారు ఎన్నికలు రావడంతో హడావుడి చర్యలకు ఉపక్రమించింది.

ఎంబీసీలకు వంద యూనిట్లు ఉచితం
దారిద్రరేఖకు దిగువన ఉండే అత్యంత వెనుకబడిన తరగతుల(ఎంబీసీ)కు చెందిన కుటుంబాలకు వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ సరఫరాకు ఆమోదం తెలుపుతూ విద్యుత్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ శుక్రవారం రాత్రి పొద్దు పోయాక మరో ఉత్తర్వు జారీ చేశారు. రజకుల లాండ్రీ షాపులకు 150 యూనిట్ల వరకు, నగల తయారీ వృత్తిదారులకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ నిధులను బీసీ సంక్షేమ శాఖ విద్యుత్‌ శాఖకు చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో మాత్రం ఉత్తర్వుల్లో పేర్కొనలేదు.  

మరిన్ని వార్తలు