బల్దియాకు మరో అవార్డు

30 Jan, 2014 02:36 IST|Sakshi
  •     ఐకాన్ ఎస్‌డబ్ల్యూఎం-2014 ప్రకటించిన నిపుణుల కమిటీ
  •      గవర్నర్ చేతుల మీదుగా నేడు అందుకోనున్న కమిషనర్
  •  
     కార్పొరేషన్, న్యూస్‌లైన్ : ఓరుగల్లు నగర పాలక సంస్థ మరో అంతర్జాతీయ అవార్డుకు ఎంపికైంది. క్లీన్‌సిటీ పేరుతో చెత్త ప్రక్షాళన నిబంధనవళి(సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్), పర్యావరణ పరిరక్షణ ప్రామాణికాలను సమర్థంగా అమలుచేస్తుండడంతో ఐకాన్ ఎస్‌డబ్ల్యూంం-2014 అవార్డు ఇవ్వాలని నిపుణుల కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లోని ఆచార్య ఎన్‌జీ.రంగా వ్యవసాయ యూనివర్సిటీలో రెండు రోజులుగా సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై జరుగుతున్న నాలుగో అంతర్జాతీయ సదస్సులో నిర్ణయించారు. దీంతో గురువారం సాయంత్రం అవార్డును గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా బల్దియా కమిషనర్ సువర్ణ పండాదాస్ స్వీకరిస్తారని అధికారులు తెలిపారు.
     
    రాష్ర్టంలోనే మొదటిసారిగా..
     
    నగరాలు, పట్టణాలకు సమస్యగా మారడమే కాకుండా పర్యావరణానికి ముప్పుగా పరిణమించిన చెత్త వ్యవహారంపై.. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ అమలుచేయాలని 2012 అక్టోబర్‌లో కేంద్రప్రభుత్వం కార్పొరేషన్లను ఆదేశించింది. దీంతో రాష్ర్టంలోనే మొదటిసారిగా వరంగల్‌లో క్లీన్‌సిటీ చాంపియన్‌షిప్ ప్రారంభించారు. ఆందులో భాగంగా ఇంటింటా తడి, పొడి చెత్త సేకరించడమే కాకుండా సేకరించిన చెత్త ద్వారా వర్మీ కంపోస్టు, బయో గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి, పొడి చెత్తను విక్రయింయించడం వంటి ప్రక్రియల ద్వారా ఆదాయాన్ని పోగు చేస్తున్నారు.

    ఇందులో భాగంగా అంతర్జాతీయ స్థాయి ఐకాన్-2014 అవార్డును ప్రకటించారు. కాగా, బల్దియాకు గతంలో కూడా ఐఎస్‌ఓ-14,001 సర్టిఫికెట్, జాతీయ స్థాయిలో ఉత్తమ శానిటేషన్ నిర్వహణ అవార్డు లభించగా, ఐసీఎల్‌ఈఐ సంస్థ సభ్యత్వాన్ని కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఐకాన్ అవార్డు రావడంపై బల్దియా అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురువారం అవార్డు స్వీకరించడానికి ముందు బల్దియా కమిషనర్ సువర్ణ పండాదాస్.. వరంగల్ క్లీన్‌సిటీ అమలును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తారు. దీనిపై చర్చించేందుకు బుధవారం సాయంత్రం కమిషనర్, ఎంహెచ్‌ఓ ధన్‌రాజ్ సమావేశమై సమాలోచనలు చేశారు.
     

>
మరిన్ని వార్తలు