ఏసీబీ వలలో మరో చేప

29 Jan, 2014 02:42 IST|Sakshi

 రూ. 8 వేలు లంచం తీసుకుంటూ
 అధికారులకు పట్టుబడిన హౌసింగ్ ఏఈ
 ఇందిరమ్మ బిల్లు మంజూరుకు నజరానా
 
 లంచావతారాల కోసం వల వేసిన ఏసీబీకి ఇరవై నాలుగు గంటలు గడిచీ గడవక ముందే మరో అవినీతి చేప చిక్కింది. పాయకరావుపేటలో తహశీల్దారును, ఆర్‌ఐని పట్టుకున్న మర్నాడే అవినీతి నిరోధక అధికారుల దాడిలో హౌసింగ్ ఏఈ పట్టుబడడం సంచలనం రేపింది. కె.కోటపాడు హౌసింగ్ ఏఈ లెక్కల సత్యనారాయణ మంగళవారం లబ్ధిదారుడి నుంచి రూ. 8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.
 
 కె.కోటపాడు, న్యూస్‌లైన్: ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు నుంచి లంచం పిండిన గృహ నిర్మాణ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ ఏసీబీ ఉచ్చులో చిక్కుకున్నారు.  కె.కోటపాడు హౌసింగ్ ఏఈ లెక్కల సత్యనారాయణ లెక్కను ఏసీబీ అధికారులు తేల్చేశారు. ఇందిరమ్మ పథకం లబ్ధిదారు నీలి శ్రీనివాస్ నుంచి రూ. 8 వేలు లంచం తీసుకుంటూ ఆయన తన కార్యాలయంలోనే పట్టుబడ్డారు. కె.కోటపాడు గ్రామానికి చెందిన నీలి శ్రీనివాస్‌కు గత రచ్చబండ-2 కార్యక్రమంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఈ లబ్ధిదారుడికి మొదటి విడత హౌసింగ్ బిల్లుగా రూ. 15 వేలు మంజూరైన సందర్భంలో హౌసింగ్ ఏఈ సత్యనారాయణ రూ. 6 వేలు లంచం అడిగారు. రెండో విడతలో ఇస్తానని శ్రీనివాస్ చెప్పారు. దాంతోరెండో దఫా బిల్లు ఈ నెల 27న మంజూరు చేస్తానని, బ్యాంకు నుంచి నగదు తీసుకున్న తర్వాత రూ. 10 వేలు లంచంగా ఇవ్వాలని సత్యనారాయణ మరోసారి కోరారు. రూ.8 వేలు ఇస్తానని శ్రీనివాస్ ఒప్పందం కుదుర్చుకున్నారు.
 
  ఈ సంగతి గురించి శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు తెలిపారు. బిల్లు మంజూరైందని మంగళవారం ఉదయం శ్రీనివాస్‌కు హౌసింగ్ ఏఈ సత్యనారాయణ తెలిపారు. సాయంత్రం ఎస్‌బీఐ ఎటీఎం నుంచి డబ్బు డ్రా చేసి కె.కోటపాడులో గల హౌసింగ్ కార్యాలయానికి వెళ్లి ఏఈకి అందజేశారు. అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. రూ. 8 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏఈపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నామని ఏసీబీ డీఎస్పీ ఎం.నర్సింహారావు తెలిపారు. ఈ సంఘటనలో ఏసీబీ ఎస్‌ఐలు గణేష్, రామకృష్ణ పాల్గొన్నారు. లంచగొండి అధికారుల నుంచి ఇబ్బందులు పడుతున్నవారెవరైనా 94404 46170 నంబర్‌కు ఫోన్ చేయవచ్చని, ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని డీఎస్పీ తెలిపారు.

మరిన్ని వార్తలు