‘వెలుగుబంటి’ కేసులో మరో నిందితుడి అరెస్టు

8 Nov, 2013 05:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: మత్స్యశాఖ మాజీ కార్యనిర్వాహక ఇంజనీర్ వెలుగుబంటి సూర్యనారాయణపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు నమోదు చేసిన కేసులో మరో నిందితుడిని అరెస్టు చేశారు. నగరానికి చెందిన ప్రవాసభారతీయురాలు విజయలక్ష్మికి ఒడిశాతో పాటు రాష్ట్రంలోని కృష్ణపట్నంలో విద్యుత్ కేంద్రాల ఏర్పాటు అనుమతి లభించింది. వీటికి రూ.400 కోట్లు సమీకరించుకోగా, మరో రూ.200 కోట్లు అవసరమవటంతో బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలని భావించారు. తక్కువ వడ్డీకే రుణాలు ఇప్పిస్తామంటూ వెలుగుబంటి ఆమెను చెన్నైలో ఒక సమావేశానికి తీసుకువెళ్లారు.

 

సుందర్‌రాజన్, సూర్యనారాయణ తదితరులు తాము రుణం ఇప్పిస్తామంటూ విజయలక్ష్మి నుంచి ముందస్తు చెల్లింపుల పేరుతో రూ.65 లక్షల వరకు తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్ రవీందర్‌రెడ్డి నేతృత్వంలోని బృందం సుందర్‌రాజన్‌ను అరెస్టు చేయగా ఆయన న్యాయస్థానం నుంచి బెయిల్ పొంది విడుదలయ్యాడు. మిగిలిన నిందితుల కోసం సీసీఎస్ పోలీసులు గాలిస్తున్నారు. సుందర్ రాజన్ నుంచి నేరానికి సంబంధించిన రూ.4 లక్షల నగదు సైతం రికవరీ చేశారు.
 

>
మరిన్ని వార్తలు