కోస్తాలో ‘పెథాయ్‌’ కలవరం

15 Dec, 2018 04:17 IST|Sakshi

తీవ్ర తుపానుగా రూపాంతరం  

17న మధ్యాహ్నం ఒంగోలు – కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం

కోస్తాంధ్ర, రాయలసీమల్లో నేడు భారీ వర్షాలు 

మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు

సాక్షి, విశాఖసిటీ: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మరింత తీవ్రమైంది. ఇది గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా పయనిస్తోంది. శుక్రవారం రాత్రికి మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 1090, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 930 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. అనంతరం ఇది శనివారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో తుపానుగా బలపడనుంది. తుపానుగా మారిన తర్వాత 16వ తేదీ రాత్రి 11.30 గంటల సమయంలో పెథాయ్‌.. తీవ్ర తుపానుగా మారుతూ.. వాయువ్య దిశగా కోస్తాంధ్ర వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం రాత్రి విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్‌లో వెల్లడించింది. పెథాయ్‌ తీవ్ర తుపానుగా బలపడిన తర్వాత గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతోనూ కోస్తాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. సముద్రం తీవ్ర అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి చేరుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు.. ఈ నెల 17వ తేదీ మధ్యాహ్నం ఒంగోలు, కాకినాడ మధ్యలో పెథాయ్‌ తీరందాటే అవకాశం ఉందని వెల్లడించింది.
  
భారీ వర్షాలు
తీవ్ర వాయుగుండం, తుపాను ప్రభా వం వల్ల శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు కోస్తాంధ్రలో చెదురు మదురుగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. తదుపరి రెండు రోజుల పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఉత్తరాంధ్రలో చెరుదుమదురుగా వర్షం పడుతుంది.  విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో ఒకటో నంబరు ప్రమాద సూచికను ఎగురవేశారు. దీంతోపాటు కాకినాడ గంగవరం పోర్టుల్లో ఒకటో నంబర్‌ ప్రమాద హెచ్చరికతో పాటు సిగ్నల్‌ సెక్షన్‌–5ను సూచించారు. కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవు పోర్టులకు హెచ్చరిక సమాచారాన్ని ఐఎండీ పంపించింది. రాష్ట్రవిపత్తు నిర్వహణ శాఖ దక్షిణ కోస్తా జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. అవసరమైతే లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు బృందాలను సిద్ధంగా ఉండాలని ఆదేశించింది.  

తీరంలో తుపాన్ల ఘోరం
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను అతలాకుతలం చేసిన తిత్లీ తుపాను నష్టాన్ని జనం మరువకముందే మరో సూపర్‌ సైక్లోన్‌ వస్తోందనే వార్తలు కోస్తా ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా చలికాలంలో వచ్చే తీవ్ర, పెను తుపాన్లు కోస్తా జిల్లాలను వణికిస్తున్నాయి. వాయుగుండం వస్తోందంటే సముద్రతీర ప్రాంత గ్రామాలు, గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల లంక గ్రామాల వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతుంటాయి. ఈ సీజన్‌లో వచ్చిన తుపాన్లు భారీ ప్రాణ, ఆస్తి నష్టాలు కలిగించడమే ఈ భయానికి కారణం. ఆ కాలంలో వచ్చిన దివిసీమ ఉప్పెన పది వేల మందిని పొట్టన పెట్టుకోవడమే కాకుండా వేలకోట్ల ఆస్తి నష్టం మిగిల్చింది.

1990 దశకంలో సూపర్‌ సైక్లోన్‌ ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ను వణికించింది. 2013 అక్టోబరు, నవంబరు నెలల్లో ఏకంగా పైలాన్, హెలెన్, లెహర్‌ అనే మూడు తుపాన్లు భారీ నష్టం మిగిల్చాయి. 2014లో హుద్‌హుద్‌ తుపాను ఉత్తరాంధ్రను మరీ ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాను దారుణంగా దెబ్బతీసింది. మొన్న అక్టోబరు రెండో వారంలో తిత్లీ తుపాను వల్ల ప్రాణనష్టం తక్కువైనప్పటికీ ఆస్తి నష్టం మాత్రం భారీగానే ఉంది. అందువల్లే రాష్ట్రంలో తుపాను తీరం దాటనుందంటేనే తీరప్రాంతం గజగజా వణికిపోతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుపానుగా మారి ఈనెల 17వ తేదీన ఒంగోలు–కాకినాడ మధ్య తీరం దాటుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించడంతో దీనివల్ల తమకెంత ముప్పు ఉంటుందోనని తీరగ్రామాల వారు భయపడుతున్నారు. 

అక్టోబరు, నవంబరు నెలల్లోనే అధికం..
భారత వాతావరణ విభాగం సమాచారం ప్రకారం 1891 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 82 తుపాన్లు సంభవించాయి. అక్టోబరు, నవంబరు నెలల్లోనే రాష్ట్రంపై వాయుగుండాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పటివరకూ రాష్ట్రంలో సంభవించిన సూపర్‌ సైక్లోన్లలోకెల్లా అతి పెద్దది 1977లో సంభవించిన ప్రచంఢ తుపాను అని చెప్పవచ్చు. దీనినే దివిసీమ ఉప్పెన అని కూడా అంటారు. ఇందులో ఊర్లకు ఊర్లే కొట్టుకుపోయాయి. రాష్ట్రానికి సంబంధించి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనే అత్యధిక తుపాన్లు తీరం దాటాయి.  సముద్రమట్టానికి కొంచెం తగ్గులో ఉండటంవల్ల తమిళనాడు నుంచి వచ్చే తుపాన్లు ఎక్కువగా ఇక్కడే తీరం దాటతాయని, ఈ ప్రాంతం అందుకు అనువుగా ఉండటమే కారణమని వాతావరణ నిపుణులు తెలిపారు. కోస్తాలో తొమ్మిది జిల్లాలు ఉన్నప్పటికీ ఎక్కువగా నెల్లూరు, కృష్ణా జిల్లాల్లోనే తీరం దాటుతుంటాయి. ఉత్తరాంధ్రలో అయితే విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో తీరం దాటుతుంటాయి. 

మారిన విపత్తుల తీరు..
గతంతో పోల్చితే విపత్తుల తీరు మారిపోయింది. గతంలో ఏడాది పొడవునా కురిసే వర్షం ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఒకేరోజు కురుస్తోంది. ఇలా అతి స్వల్పసమయంలో అత్యధిక వర్షం కురవడంవల్ల వరదలు ముంచెత్తుతున్నాయి. గ్లోబల్‌ వార్మింగ్‌ లాంటి వాతావరణ మార్పులే  ఇలా అతి తక్కువ సమయంలో అత్యంత అధిక వర్షం కురవడానికి కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 

ఒకదాని మీద మరొకటి
ఒక్కోసారి ఒకదాని మీద మరొకటి అన్నట్లు వాయు‘గండా’లు వెంట వెంటనే వస్తుంటాయి. ఒకేనెలలో రెండు మూడు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. 1992 అక్టోబరులో  వారం రోజుల్లోనే రెండు తుపాన్లు సంభవించాయి. 1987 అక్టోబరులో కేవలం పక్షం రోజుల్లో మూడు తుపాన్లు ముంచెత్తాయి. 2013లో అక్టోబరు–నవంబరు నెలల్లో మూడు తుపాన్లు దెబ్బతీశాయి.  

ఈశాన్యంలోనే తీవ్రత ఎక్కువ
రాష్ట్రంలో నైరుతీ రుతు పవనాల కాలంలో కంటే ‘ఈశాన్యం’ సమయంలోనే ఎక్కువ వరదలు, తుపాన్లు వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే అక్టోబరు, నవంబరు నెలల్లోనే అత్యధిక తుపాన్లు సంభవించాయి. ఈశాన్య రుతుపవనాల కాలంలో అధిక విపత్తులు సంభవించి పంటలను, ఇళ్లను, ఇతర ఆస్తులను దెబ్బతీస్తున్నాయి. 2014లో హుద్‌హుద్, మొన్న అక్టోబరులో తిత్లీ తుపానువల్ల విద్యుత్తు సరఫరా వ్యవస్థ దారుణంగా దెబ్బతిని నెల రోజులుపైగా అనేక గ్రామాల్లో అంధకారంలో మగ్గాల్సి వచ్చింది. 

మరిన్ని వార్తలు