గజేంద్ర విలాపం!

29 Jan, 2019 03:21 IST|Sakshi
నాగావళి నదిలో పడి మృతిచెందిన ఏనుగు

సాక్షి ప్రతినిధి, విజయనగరం: అడవులను కొల్లగొట్టేస్తున్నారు.. అడవి జంతువులకు నిలువ నీడలేకుండా చేస్తున్నారు.. ఫలితంగా మూగజీవాలు ఆవాసాలు కోల్పోయి జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి. అక్కడ మనుగడ సాగించలేక మృత్యువాత పడుతున్నాయి. జిల్లాలో కొన్ని నెలలుగా తిరుగుతున్న ఎనిమిది ఏనుగుల్లో ఒక్కొక్కటిగా మృత్యువాత పడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం విద్యుత్‌ షాక్‌తో ఓ గజరాజు చనిపోతే.. తాజాగా విషాహారం తిని, నదిలో మునిగి మరో ఏనుగు మరణించింది. అడవుల్లోకి గజరాజులను తరలించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవ్వడంవల్లే ఈ దుస్థితి ఏర్పడింది. మిగిలిన ఆరు ఏనుగులను కూడా అడవిలోకి పంపే ప్రయత్నాలు కనిపించడంలేదు. మరోవైపు.. తమ రాష్ట్ర పరిధిలోని అటవీ ప్రాంతంలోకి తరలించడానికి ఒడిశా సర్కార్‌ అంగీకరించడంలేదు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం సైతం దీనిపై నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుండడంతో అధికారులు ప్రేక్షకపాత్రకు పరిమితమవుతున్నారు. 

ఏనుగు ఎలా చనిపోయిందంటే.. 
ఏనుగుల గుంపులో నుంచి రెండు రోజుల క్రితం ఓ ఏనుగు తప్పిపోయింది. మొక్కజొన్న పంటకు వాడే గుళికలను తిన్న ఆ గజరాజు వెంటనే అపస్మారక స్థితికి చేరుకుంది. అనంతరం స్పృహలోకి వచ్చి మిగిలిన గుంపును కలుసుకునేందుకు రెండ్రోజులపాటు అది ఎంత తిరిగినా ఫలించలేదు. అప్పటికే అవి నాగావళి నదిని దాటేశాయి. కానీ, మూడు కిలోమీటర్లలోపు ఉన్న తమ సహచరులను ఏనుగులు పసిగట్టగలవు. అలా కూడా గుర్తించలేకపోవడంతో ఏనుగు ఆ ప్రాంతంలోనే ఉండిపోయింది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం నుంచి దాని ఆచూకీ లేకుండాపోయింది. దీంతో అటవీ శాఖ సిబ్బంది దానిని వెతకడం ప్రారంభించారు. గుంపులో కలపాలని ప్రయత్నించారు. ఆచూకీ లభించలేదు. నాగావళి నదిలో సోమవారం ఉదయం తేలింది. ఏనుగు ఊబిలో చిక్కుకుని గట్టుపైకి రాలేక మరణించినట్లు తెలుస్తోంది. అధికారులు దాన్ని వెలికి తీశారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి అంత్యక్రియలు జరిపించారు. 

పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం 
ఏనుగులు జిల్లాలో ప్రవేశించి నాలుగు నెలలవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఇటీవల ఓ వ్యక్తిపై అవి దాడిచేసి చంపేసిన తర్వాత విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అటవీశాఖ ఉన్నతాధికారులతో పాటు ఒడిశా అధికారులు విజయనగరంలో సమావేశమయ్యారు. కానీ, వాటిని తరలించలేమనే నిర్ధారణకు వచ్చినట్లు ప్రకటించారు. ఇప్పుడు ఒడిశాలోని అటవీ ప్రాంతంలోకి మళ్లీ ఈ ఏనుగులను విడిచిపెట్టడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేదు.  ఇప్పుడు వీటిని శ్రీకాకుళం జిల్లా అడవులకు తరలించడమే ఏకైక మార్గం.కానీ ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు