పేదలకు విద్య... ‘క్లస్ట’తరమే!

3 Nov, 2014 00:58 IST|Sakshi
పేదలకు విద్య... ‘క్లస్ట’తరమే!

 రాజ్యాంగం హామీ ఇచ్చిన నిర్బందోచిత ప్రాథమిక విద్యకు తిలోదకాలిచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఏటా ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు పోటీలో దూసుకుపోతుంటే నోళ్లు వెళ్లబెడుతున్న సర్కారీ బడులు ప్రస్తుతం మనుగడనే కోల్పోయే దుస్థితి దాపురించింది. పాఠశాలల నిర్వహణ చేతకాక చేతులెత్తేసిన ప్రభుత్వం క్లస్టర్ స్కూళ్లంటూ పిల్లల జీవితాలతో మరో ప్రయోగం చేసి విద్యను పేదలకు అందనంత ఎత్తుకు తీసుకుపోయేందుకు సమాయత్తమవుతోంది.
 
 ఏలూరు సిటీ : ప్రాథమిక విద్యారంగం భారం మోయలేకపోతున్న ప్రభుత్వం దాన్ని వదిలించుకొనేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఏటా బడ్జెట్‌లో రూ. వేలకోట్లు కుమ్మరిస్తోన్నా ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయడంలో విఫలమౌతోన్న సర్కారు క్లస్టరు స్కూళ్లను ఏర్పాటు చేసి ఈ సమస్య నుంచి బయటపడాలని చూస్తోంది. సంక్షేమ వసతిగృహాలు, పాఠశాలల నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో ఈ రెండింటినీ ఒకేచోట నిర్విహ ంచేలా ఈ కొత్త వ్యవస్థను తెరపైకి తెస్తోంది. జిల్లాలో 500 క్లస్టర్ పాఠశాలల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. దీంతో భారీసంఖ్యలో స్కూళ్లను తగ్గించనుంది. పెలైట్ ప్రాజెక్టుగా ద్వారకాతిరుమల మండలంలో ఈ విధానం అమలు చేశారు. ఇక్కడ సుమారు 40 పాఠశాలలు మూతపడే పరిస్థితి ఏర్పడగా, ఉపాధ్యాయులు ఖాళీగా మిగలనున్నారు.
 
 మండలానికి 10 క్లస్టర్ స్కూళ్లు
 సంక్షేమ వసతి గృహాల్లో అవినీతి, నిర్లక్ష్యాన్ని తొలగించడం, ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేయడంలో భాగంగా క్లస్టర్ పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే జిల్లాలో చాలా మండలాల్లోని పాఠశాలలు విద్యార్థులు లేకుండానే నడుస్తున్నాయి. అలాంటిచోట్ల ముగ్గురు, నలుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు సమీకృత విద్యాసంస్థలను నెలకొల్పాలని ప్రభుత్వం ప్రణాళిక రచించింది. దీనిలో భాగంగానే జిల్లాలో 500 క్లస్టర్ పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు. మండలానికి 10 వరకు క్లస్టర్ స్కూల్స్ ఉంటాయి. అంటే రెండు నుంచి నాలుగు గ్రామాలకు ఒక క్లస్టర్ పాఠశాల ఉంటుంది. రెసిడెన్షియల్ తరహాలో ఏర్పా టు చేసే ఈ పాఠశాలల్లో బోధనతోపాటు భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. ఏఏ పాఠశాలల్లో విద్యార్థులు ఎంతమంది ఉన్నా రు? టీచర్లు ఎంతమంది పనిచేస్తున్నారు? అనే విషయాలపై విద్యాశాఖ, రాజీవ్ విద్యామిషన్ అధికారులు నివేదిక తయారు చేశారు.
 
 పేద వర్గాలకు విద్య దూరం
 సమీకృత పాఠశాలల ఏర్పాటుతో ప్రతి గ్రామంలోనూ ప్రభుత్వ పాఠశాల ఉండే అవకాశాలు కనుమరుగవుతాయి. దీంతో పిల్లలను దూరంగా పంపలేక, ఇంట్లో ఉంచుకోలేక పేద తల్లిదండ్రులు ఇబ్బంది పడతారని విద్యారంగ నిపుణులు అంటున్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్‌లో ఫలితాలు బాగున్నంత మాత్రాన అన్ని స్కూళ్లను అలా మార్చేస్తే కొత్త ఇబ్బం దులు తలెత్తుతాయంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం 2,600 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ప్రతి మండలంలో సుమారు 30 నుంచి 60 వరకు ప్రాథమిక పాఠశాలలు నడుస్తున్నాయి. క్రమేపీ వాటి సంఖ్య తగ్గుతూ వస్తుండగా క్లస్టర్ విధానంతో వాటి మనుగడ ప్రమాదంలో పడింది. అలాగే జిల్లాలో ఉన్న 151 సంక్షేమ హాస్టల్స్ ఈ స్కూళ్ల ఏర్పాటుతో కనుమరుగుకానున్నాయి.
 
 ప్రైవేటు, కార్పొరేట్‌కు వరం
 ప్రతి విద్యార్థికీ భోజన, వసతితో కూడిన చదువు అందించేందుకు ఏర్పాటు చేయనున్న ఈ తరహా పాఠశాలలతో ఉపయోగం ఉన్నా... పేద వర్గాలకు నష్టం కూడా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా మండలానికి 10 క్లస్టర్ స్కూల్స్ ఏర్పాటు చేస్తే పిల్లలంతా ఎలాగూ అక్కడకు రారు. దీంతో ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు వరంలా మారుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కార్పొరేట్ విద్యాసంస్థల దెబ్బకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు కుదేలయ్యాయి. ఇక ఈ విధానంతో కార్పొరేట్ గుత్తాధిపత్యంలోకి ప్రాథమిక విద్య వెళ్లిపోతుందనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
 
 విద్యకు పేదలను  
 దూరం చేసే పథకం
 ఈ విధానం ద్వారా భారీఎత్తున ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేసినట్టే. పాఠశాలలు మూసివేస్తే అక్క డ లక్షలాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన భవంతులు, ఇతర విద్యా సామగ్రి ఏం చేస్తారు. ఇది ప్రాథమిక విద్యకు పేదలను దూరం చేసే పథకం మాత్రమే. స్కూళ్లలో సరిపడినంత మంది ఉపాధ్యాయులను నియమించాలి. అప్పుడే నాణ్యమైన విద్య అందుబాటులో ఉంటుంది.
 -  గగ్గులోతు కృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
 ఏపీటీఎఫ్ 1938
 
 సార్వత్రిక విద్యకు విఘాతం
 1986లో ప్రవేశపెట్టిన అందరికీ విద్య విధానానికి తీవ్ర విఘాతం కలుగుతుంది. ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించి భారం లేకుండా చేసుకొనేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచించింది. మండలాన్ని యూనిట్‌గా కాకుండా ఒక గ్రామంలోని రెండు, మూడు స్కూళ్లను విలీనం చేస్తే ఉపయోగం ఉంటుంది. కానీ ఇలా రెండు, మూడు గ్రామాలకు ఒక పాఠశాల ఏర్పాటు చేస్తే కష్టాలు తప్పవు. ఈ నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలి.                        - షేక్‌సాబ్జీ, రాష్ట్ర కార్యదర్శి, యూటీఎఫ్
 
 కార్పొరేట్‌కు సహకారమే
 గ్రామాల్లో ప్రభుత్వ స్కూళ్లు మూసివేయడం ద్వారా కార్పొరేట్ విద్యాసంస్థలకు పరోక్షంగా ప్రభుత్వమే సహకారం అంది స్తోంది. బస్‌పాస్‌లు అందించినంత మాత్రాన చిన్నారులు ఇతర గ్రామాలకు ఎలా వెళ్లగలరు? ప్రభుత్వం తమ బాధ్యత నుంచి తప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. క్లస్టర్ విధానం వల్ల డ్రాపవుట్స్ భారీగా పెరిగిపోయే ప్రమాదం ఉంది.
   - పి.వెంకటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, పీఆర్‌టీయూ

 

మరిన్ని వార్తలు