ఇక ‘సిట్’ విచారణ

25 Apr, 2015 03:46 IST|Sakshi

రెండు రోజుల్లో తిరుపతికి రాక
శేషాచలం ఎన్‌కౌంటర్‌పై ఇంకో దర్యాప్తు
ఉక్కిరిబిక్కిరి అవుతున్న టాస్క్‌ఫోర్సు

 
చిత్తూరు (అర్బన్) : ఏ సమయంలో జిల్లా పోలీసులు ఎర్రచందనం కూలీల కాల్చివేతకు పాల్పడ్డారోగానీ.. జరిగిన సంఘటనలపై ఎవరికి సమాధానాలు చెప్పుకోవాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌కు సంబంధించి దర్యాప్తు చేయడానికి శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే 20 మంది కూలీల కాల్పుల ఘటనపై రాష్ట్ర మానవహక్కుల సంఘం నుంచి జాతీయ మానవహక్కుల సంఘం, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం, దేశ అత్యున్నత న్యాయస్థానం వరకు నిందితులుగా నిలబడ్డ పోలీసులు సిట్ ఏర్పాటుతో మరింత ఇరకాటంలో పడ్డారు.

అడవుల్లోకి ప్రవేశించిన కూలీలు నిజంగానే పోలీసులపైకి హత్యాయత్నానికి పాల్పడ్డారా..? అందుకే పోలీసులు కాల్పులు జరిపారా ? అనే దానిపై సిట్‌లోని ఎనిమిది మందితో కూడిన బృందం జిల్లాకు చెందిన టాస్క్‌ఫోర్సు పోలీసులను, అటవీశాఖ సిబ్బందిని ప్రశ్నించనుంది. ఎన్‌కౌంటర్ జరిగిన రోజున గాయపడ్డామని చెబుతున్న పోలీసులను సైతం ఈ బృందం విచారిస్తుంది. సంఘటన స్థలాన్ని పరిశీలించి అక్కడ సాక్ష్యాలను సైతం నమోదు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి, న్యాయస్థానాలకు అందచేయనుంది.

ఈ బృందంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)కు చెందిన రవిశంకర్ అయ్యర్ (ప్రస్తుతం ఈయన కర్నూలు రేంజ్ డీఐజీగా పనిచేస్తున్నారు) బాధ్యత వహిస్తారు. ఈయనతో పాటు సాంకేతిక విభాగం ఎస్పీ పాలరాజు, పశ్చిమ గోదావరి ఏఎస్పీ చంద్రశేఖర్, సీఐడీ డీఎస్పీలు యుగంధర్, బాబు, రఘు, కోరుకొండకు చెందిన సీఐ చంద్రశేఖర్, తిరుపతి వీఆర్‌లో ఉన్న మరో సీఐ మధుసూదన్ సభ్యులుగా ఉంటారు. సోమవారం ఈ బృందం తిరుపతిలోని ఎన్‌కౌంటర్లు జరిగిన స్థలాన్ని పరిశీంచి, టాస్క్‌ఫోర్సు పోలీసులను ప్రశ్నించనుంది. సంఘటన జరిగిన రోజున ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపామని చెప్పిన పోలీసు యంత్రాంగం వరుస విచారణలతో ఆత్మరక్షణలో పడింది.

మరిన్ని వార్తలు