‘కృష్ణా’ను మరో మూసీ చేయొద్దు

13 Sep, 2014 02:13 IST|Sakshi
  • రైతాంగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాథ్
  • విజయవాడ : రివర్ వ్యూ కేపిటల్ పేరుతో కృష్ణా నదిని మరో మూసీ నది చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి రైతాంగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాథ్ హితవు పలికారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. విజయవాడ పరిసరాల్లో రాజధాని ఏర్పాటు కాబోతున్న తరుణంలో కృష్ణా నదిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

    రాజధాని ఎక్కడ ఏర్పాటుచేసినా తమకు అభ్యంతరం లేదని, కృష్ణా నది కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టంచేశారు. స్వరాజ్ మైదానానికి ఆక్రమణల చెర నుంచి విముక్తి కల్పించాలని కోరారు. 1992లో అప్పటి ప్రభుత్వం స్వరాజ్ మైదానంలోని ఆక్రమణలు తొలగించాలని జీవో జారీచేసిన విషయాన్ని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు సైతం ప్రభుత్వ ఆ జీవోను సమర్థించిందన్నారు. రైతు బజారును తొలగించి నగరంలోని ఇతర ప్రాంతాల్లో పదికిపైగా రైతు బజారులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు.

    బందరు కాలువ, ప్రకాశం రోడ్డు నుంచి ఇందిరాగాంధీ స్టేడియం వరకు ఉన్న  350 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఆక్రమణలు, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిన భూములను తిరిగి తీసుకోవాల న్నారు. విజయవాడకు దుఖఃదాయినిగా మారిన బుడమేరు వరద నీరు నగరంలోకి రాకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరారు.

    గుణదల నుంచి ఎనికేపాడు వరకు బుడమేరు అనేక మెలికలు తిరిగిందని, ముస్తాబాద చానల్‌ను వెడల్పు చేసి అందులో బుడమేరును కలపడం ద్వారా చాలా వరకు వరద నగరంలోకి రాకుండా పోతుందని, పోలవరం కాలువకు ఇరువైపులా రహదారి ఏర్పాటు చేస్తే జాతీయ రహదారికి కనెక్టివిటీ ఏర్పడుతుందని సూచించారు. రాజధాని నిర్మాణం కోసం అవసరమైన అన్ని ప్రత్యామ్నాయాలను వినియోగించుకోవాలని, నగరంలో మరిన్ని సమస్యలు తల్తెకుండా చూడాలని కోరారు. నగరంలోని ప్రధాన కాలువల్లో మురుగునీరు చేరకుండా చర్య తీసుకోవాలని పేర్కొన్నారు.
     

మరిన్ని వార్తలు