ఆక్వా రైతుపై మరో పిడుగు

9 May, 2020 05:17 IST|Sakshi

ఫీడ్‌ రేటు కేజీకి రూ.6 పెంపు

రూ. వెయ్యి కోట్లకు పైగా భారం  

సాక్షి, అమరావతి: ఆక్వా రైతులపై మేత రూపంలో మరో పిడుగు పడింది. బహుళ జాతి సంస్థలు వారం రోజుల క్రితం అమాంతం ఫీడ్‌ ధరలు పెంచేశాయి. కేజీకి రూ.6 వరకు ధర పెరగడంతో రాష్ట్రంలోని ఆక్వా రైతులపై రూ.వెయ్యి కోట్ల వరకు భారం పడుతోంది. సీజన్‌ ప్రారంభానికి ముందే ధరలను పెంచేసిన కంపెనీలు.. మేత కొనుగోళ్లు ఊపందుకున్న తరువాత ఇంకా పెంచేసే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.  

సీడ్‌ ధరను నియంత్రించినా.. 
► సీజన్‌ ఆరంభంలో రొయ్య పిల్ల (సీడ్‌) రూపంలో ఆక్వా రైతులకు సమస్య ఎదురైంది. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని హేచరీలు, రైతులతో సమావేశం నిర్వహించి ఒక్కో రొయ్య పిల్లకు 30 నుంచి 35 పైసల్లోపు ధర నిర్ణయించింది. 
► ఇందుకు విరుద్ధంగా అమ్మకాలు జరిపే హేచరీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కలెక్టర్లకు ఈ బాధ్యతను అప్పగించడంతో హేచరీల నిర్వాహకులు ప్రభుత్వం నిర్ణయించిన ధరకే సీడ్‌ విక్రయిస్తున్నారు. 
► అయితే, బహుళ జాతి సంస్థలు ఫీడ్‌ ధరలు ఉన్నట్టుండి పెంచేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 

10 లక్షల మెట్రిక్‌ టన్నుల మేత అవసరం
► రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాల్లో 26 వేల హెక్టార్లలో వెనామీ రొయ్యలను సాగు చేస్తున్నారు. ఏటా రెండు పంటలకు కలిపి 10 లక్షల మెట్రిక్‌ టన్నుల మేత అవసరం అవుతుంది.  
► మేతను ఉత్పత్తి చేసే సంస్థల్లో 70 శాతం థాయ్‌లాండ్‌కు చెందిన బహుళ జాతి కంపెనీలు, 30 శాతం స్థానిక కంపెనీలు ఉన్నాయి. రైతుల్లో ఎక్కువ మంది బహుళ జాతి కంపెనీల మేతనే కొనుగోలు చేస్తున్నారు. 
► రైతులపై భారం తగ్గించేందుకు మేత కంపెనీలతో సంప్రదింపులు జరిపి ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ప్రాన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు పీఆర్‌ మోహన్‌రాజు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. 

తగ్గించేవిధంగా సంప్రదింపులు  
ఫీడ్‌ ధరల తగ్గించే దిశగా బహుళ జాతి సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నాం. నాలుగేళ్లుగా ధరలు పెంచలేదని కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. రైతుల వివరణ ఇందుకు విరుద్ధంగా ఉంది. రెండువర్గాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ధరలపై నిర్ణయం తీసుకుంటాం. ఆక్వా రైతులను ఆదుకునేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. 
– మోపిదేవి వెంకట రమణారావు, రాష్ట్ర పశు, మత్స్య శాఖ మంత్రి  

మరిన్ని వార్తలు