మరో స్విస్‌ చాలెంజ్‌!

5 Nov, 2017 03:31 IST|Sakshi

కాకినాడ సెజ్‌లోని వాణిజ్య పోర్టుకు స్విస్‌ పద్ధతిలో బిడ్డర్‌ ఎంపిక

జీఎంఆర్‌ ప్రతిపాదనలను స్వీకరించిన ప్రభుత్వం

జీఎంఆర్‌ ఎంపిక కాకపోయినప్పటికీ లీజు వసూలు చేసే అధికారం

సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో స్విస్‌ చాలెంజ్‌ విధానాన్ని న్యాయస్థానం తప్పుపట్టినా ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా మరో స్విస్‌ చాలెంజ్‌ విధానానికి సిద్ధపడుతోంది. కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్‌)లో ఏర్పాటు చేయనున్న వాణిజ్య పోర్టు కోసం స్విస్‌ చాలెంజ్‌ విధానాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఈ వాణిజ్య పోర్టు ఏర్పాటు కోసం స్విస్‌ చాలెంజ్‌ విధానంలో బిడ్డర్‌ను ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే జీఎంఆర్‌ సంస్థ సమర్పించిన పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే స్విస్‌ చాలెంజ్‌ విధానంలో జీఎంఆర్‌ ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని మౌలిక సదుపాయాలశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు ఒకవేళ స్విస్‌ చాలెంజ్‌లో జీఎంఆర్‌ ఎంపిక కాకపోయినప్పటికీ సదరు సంస్థకే భూమి లీజు వసూలు అధికారం కట్టబెట్టాలని సర్కారు భావిస్తున్నట్టు సమాచారం.

పోర్టును మారుస్తూ...
వాస్తవానికి మొదట్లో ఇక్కడ కేవలం క్యాప్టివ్‌ పోర్టు.. అంటే సొంత అవసరాలకు (సెజ్‌లోని కంపెనీల అవసరాల కోసం) మాత్రమే పోర్టును నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాకినాడ సెజ్‌లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కోన గ్రామం వద్ద ఈ పోర్టు ఏర్పాటు కానుంది. ఇక్కడ వాణిజ్య పోర్టును నిర్మించుకుంటామనే ప్రతిపాదనను జీఎంఆర్‌ సంస్థ తెరమీదకు తెచ్చింది. దీనికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇదే అదనుగా స్విస్‌ చాలెంజ్‌ విధానంలో బిడ్డర్‌ను ఎంపిక చేసేందుకు వీలుగా జీఎంఆర్‌ ముందుగానే ప్రతిపాదనలను కూడా సమర్పించింది. జీఎంఆర్‌ ఇచ్చిన ప్రతిపాదనలను ప్రభుత్వం స్వీకరించి... స్విస్‌ చాలెంజ్‌ విధానానికి తెరలేపింది. ఈ పోర్టు ఏర్పాటు కోసం ఎంపికైన కంపెనీతో 30 సంవత్సరాలపాటు ఒప్పందం అమల్లో ఉంటుంది.  అవసరాన్ని బట్టి రెండు విడతలుగా. ఒక్కో విడతలో పదేళ్లపాటు ఒప్పందాన్ని పొడిగించుకునే వెసులుబాటు కల్పిస్తారు. అంటే మొత్తం 50 ఏళ్ల పాటు ఒప్పందం అమల్లో ఉంటుందన్నమాట.

బిడ్డింగ్‌లో నెగ్గకపోయినా!
జీఎంఆర్‌ సంస్థ సమర్పించిన ప్రతిపాదనల ఆధారంగా స్విస్‌ చాలెంజ్‌ విధానంలో కంపెనీలను బిడ్డింగ్‌ను పిలవనున్నారు. ఒకవేళ ఈ ప్రక్రియలో జీఎంఆర్‌ ఎంపిక కాకపోయినప్పటికీ పోర్టుకు ఇచ్చే భూములకు లీజు వసూలు చేసుకునే అధికారాన్ని మాత్రం ఆ సంస్థకే కట్టబెట్టాలని ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. కాకినాడ పోర్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ మొత్తం వ్యవహారంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు