యువతిని మోసగించిన మరో యువతి

2 Mar, 2014 05:39 IST|Sakshi
  •    వరంగల్ రైల్వేస్టేషన్ లాకర్‌లోని బ్యాగుతో అపహరణ
  •      బ్యాగులో 10 తులాల బంగారు ఆభరణాలు, దుస్తులు
  •      ఆలస్యంగా వెలుగు చూసిన సంఘటన
  •      జీఆర్‌పీ పోలీసులు ఎదుట బాధితురాలి ఆవేదన
  •  మట్టెవాడ, న్యూస్‌లైన్ : ఇంట్లో నుంచి చెప్పకుండా వచ్చిన ఓ యువతికి మాయ మాటలు చెప్పి, ఆమెకు సంబంధించిన బ్యాగ్‌ను మరో యువతి ఎత్తుకెళ్లిన సంఘటన వరంగ ల్ రైల్వేస్టేషన్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలి తండ్రి కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన బెరైడ్డి నర్సింహారెడ్డికి కూతురు సోనీ(18) ఉంది. ఆమె తన అత్తగారి ఊరైన అదే జిల్లా వల్లభాపూర్ నుంచి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా హుజురాబాద్‌కు వచ్చి అక్కడి నుంచి బస్సులో ఫిబ్రవరి 16న వరంగల్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. రెండురోజులపాటు ప్లాట్ ఫాంపైనే గడిపింది.

    18న సుధ అనే యువతి కలిసి సోనీకి మాయమాటలు చెప్పి ఆమె వద్ద ఉన్న బ్యాగును రైల్వేస్టేషన్‌లోని లాకర్‌లో పెట్టింది. సుధా తన పేరుతోనే అడ్రస్ రాయించి, రశీదు కూడా తీసుకుంది. అనంతరం సోనీని కరీమాబాద్‌లోని ఎరుకల సాయమ్మ ఇంట్లో వదిలేసి వెళ్లిపోయింది. తిరిగి రైల్వేస్టేషన్‌కు వచ్చిన సుధ లాకర్‌లోని బ్యాగు తీసుకుని ఉడాయించింది. సాయమ్మ ఇంట్లో ఉన్న ఆమె సుధ కోసం ఎన్నిరోజులు ఎదురు చూసినా ఆమె రాకపోవడంతో అనుమానం కలిగింది. 24వ తేదీన సోనీ తన పుట్టింటికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది.

    దీంతో ఆమె తండ్రి నర్సింహారెడ్డితోపాటు బంధువులు వచ్చి సోనీని తీసుకెళ్లారు. అయితే బ్యాగు కోసం వరంగల్ స్టేషన్ లాకర్ వద్దకు వెళ్లగా సుధ అనే యువతి తీసుకెళ్లినట్లు లాకర్ నిర్వాహకుడు చెప్పాడు. అందులో 10 తులాల బంగారం, బట్టలున్నాయని సోనీ బోరున విలపించింది. సుధను పట్టుకుని తమకు న్యాయం చేయాలని వారు రైల్వే పోలీసులను కోరారు.

    ఈ విషయమై జీఆర్‌పీ ఎస్సై మునీరుల్లా మాట్లాడుతూ వీణవంక పోలీస్‌స్టేషన్‌లో సోనీ మిస్సింగ్ కేసు నమోదై ఉందని, అక్కడివారే కేసు విచారణ చేస్తారని తెలిపారు. కేసును జీఆర్‌పీకి ట్రాన్స్‌ఫర్ చేస్తే అప్పుడు తాము స్పందించనున్నట్లు వివరించారు. ఇదిలా ఉండగా సాయమ్మను వీణవంక పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి, సుధను రెండు రోజుల్లో తమ వద్దకు తీసుకురావాలని హెచ్చరించినట్లు తెలిసింది.
     

మరిన్ని వార్తలు