మాడగడలో ఆంత్రాక్స్‌ కలకలం

10 Jul, 2019 09:56 IST|Sakshi
మాడగడలో పర్యటిస్తున్న సబ్‌కలెక్టర్‌ వెంకటేశ్వర్, వైద్యులు

సాక్షి, అరకు(విశాఖపట్నం) : మాడగడ పంచాయతీ కేంద్రంలో ఇద్దరు గిరిజనులు ఆంత్రాక్స్‌ వ్యాధి లక్షణాలతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ గ్రామానికి చెందిన జి.బుజ్జిబాబు, ఎం.కోటిబాబు చేతులు వాపు, చిన్న కురుపులు ఏర్పడడంతో స్థానిక పీహెచ్‌సీ వైద్యబృందం నాలుగు రోజుల క్రితం సేవలందించారు. ఆంత్రాక్స్‌ వ్యాధి లక్షణాల అనుమానంతో వీరిద్దరిని కేజీహెచ్‌కు తరలించి,ఉ న్నత వైద్యసేవలు కల్పించారు. అయితే కేజీహెచ్‌ వైద్యులు బుజ్జిబాబు, కోటిబాబుల నుంచి రక్త నమునాలను సేకరించి పరీక్షలు జరుపుతున్నారు. వీరికి సోకినది ఆంత్రాక్స్‌.. ఇతర చర్మవ్యాధా అనేది నిర్థారణ కావల్సి ఉంది. 

సందర్శించిన సబ్‌ కలెక్టర్‌
మాడగడలో ఇద్దరు గిరిజనులు ఆంత్రాక్స్‌ లక్షణాలతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారనే సమాచారం మేరకు ప్రభుత్వం అప్రమత్తమైంది. పాడేరు సబ్‌కలెక్టర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్‌ మంగళవారం మాడగడ గ్రామాన్ని సందర్శించారు. డీఎంహెచ్‌వో తిరుపతిరావు, పశు సంవర్థకశాఖ ఏడీ రామకృష్ణ, పీహెచ్‌సీ వైద్యాధికారి వినీల, ఇతర వైద్యసిబ్బందిని అప్రమత్తం చేశారు. సబ్‌కలెక్టర్‌ గ్రామంలోని అన్ని వీధులను సందర్శించారు. ఆంత్రాక్స్‌ వ్యాధి లక్షణాలతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఇద్దరు గిరిజనుల కుటుంబాలను పరామర్శించారు.

బుజ్జిబాబు,కోటిబాబు ఆహార అలవాట్లపై ఆయన ఆరా తీశారు. వారం రోజుల క్రితం సుంకరమెట్ట వారపుసంతలో కొనుగోలు చేసిన పశుమాంసాన్ని వండుకు తినినట్టు కుటుం సభ్యులు కలెక్టర్‌కు తెలిపారు. బాకా బాబురావు అనే గిరిజనుడు తన చేతికి కూడా దురదలు వస్తున్నాయని చెప్పడంతో వెంటనే వైద్యసేవలందించి కేజీహెచ్‌కు తరలించాలని వైద్యబృందాన్ని సబ్‌కలెక్టర్‌ ఆదేశించారు. 

పశుమాంస విక్రయాలు నియంత్రిస్తాం
ఏజెన్సీలోని అనారోగ్య పశువుల వధ, నిల్వ మాంసం అమ్మకాల విక్రయాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని సబ్‌కలెక్టర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్‌ విలేకరులకు తెలిపారు.వారపుసంతల్లో పశుమాంసం విక్రయాలపై తనిఖీలు చేపట్టి, అవసరమైతే అమ్మకాలపై నిషేధం అమలుకు పాడేరు ఐటీడీఏ పీవో బాలాజీకి నివేదిక ఇస్తామన్నారు. ఆంత్రాక్స్‌ వ్యాధిపై గ్రామాల్లో గిరిజనులకు అవగాహన సదస్సులు నిర్వహించి, పశుమాంసానికి దూరంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

పశువులకు ఆంత్రాక్స్, ఇతర సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా పశు వైద్యశిబిరాలు నిర్వహిస్తామన్నారు.మాడగడ గ్రామంలో ఇద్దరు గిరిజనులు కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారని, అయితే వారికి ఆంత్రాక్స్‌ వ్యాధి నిర్థారణ కాలేదన్నారు. గ్రామంలో అందరు గిరిజనులకు వైద్యపరీక్షలు నిర్వహించేందుకు వైద్యబృందాలను అప్రమత్తం చేస్తున్నామని సబ్‌కలెక్టర్‌ వివరించారు.  

మరిన్ని వార్తలు