కంచే.. చేను మేస్తోంది..

27 Feb, 2015 01:02 IST|Sakshi

రాజమండ్రి క్రైం :అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పేరుచెబితేనే అవినీతి అధికారులు హడలెత్తిపోతారు. అలాంటి శాఖలో జిల్లాలో ఒక అధికారి ఆ శాఖ ప్రతిష్టనే మసకబారుస్తూ.. అవినీతికి పాల్పడే వారి జాబితా దగ్గర పెట్టుకుని, వారిని దాడుల పేరుతో బెదిరించి తానే అవినీతికి తెగబడుతున్నాడు. ఆ శాఖ ఉన్నతాధికారి విశాఖపట్నం నుంచి విధులు నిర్వహిస్తుండటం అతడి అవినీతికి ఆజ్యం పోస్తోంది. జిల్లాలో అతడి బారిన పడిన పలు శాఖల అధికారులు లబోదిబోమంటున్నారు. వివరాలిలా ఉన్నాయి. అవినీతి నిరోధక శాఖకు రాజమండ్రిలో రేంజ్ కార్యాలయం ఉంది. ఈ రేంజ్‌కు  డీఎస్పీగా 2014లో వెంకటేశ్వరరావు పని చేశారు. ఆయన బదిలీ అయ్యాక విశాఖపట్నం ఏసీబీ డీఎస్పీ ఎన్.రమేష్‌కే 2014 నవంబర్ నుంచి రాజమండ్రి బాధ్యతలు కూడా అప్పగించారు. ఆయన విశాఖ కేంద్రంగానే విధులు నిర్వహిస్తూ ప్రాధాన్యం ఉన్న కేసులు ఉన్నప్పుడు జిల్లాకు వస్తుంటారు. దానిని ఆసరాగా చేసుకుని జిల్లాకు చెందిన ఆ శాఖ అధికారి అవినీతికి తలుపులు బార్లా తెరిచారు. ఈ విషయాన్ని ఆ శాఖలోని ఉద్యోగులే బహిరంగంగా చెప్పుకొంటున్నారు.
 
 డబ్బులు వచ్చే శాఖలపైనే గురి..
 ఆ ‘అవినీతి’ అధికారి దృష్టంతా ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే శాఖలపైనే. జిల్లాలో రిజిస్ట్రేషన్, సేల్స్ టాక్స్, ఇరిగేషన్, విద్యుత్, ట్రెజరీ, తహశీల్దార్ కార్యాలయాలే లక్ష్యాలుగా వసూళ్ల దందా సాగిస్తున్నారు. స్థాయిని బట్టి రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకూ భయపెట్టి గుంజుతున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అతడి బారినపడిన అమలాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చెందిన ఓ అధికారి ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయంలో ఉన్నారు. గత వారం తన నుంచి రూ.లక్షన్నర గుంజినట్టు చెప్పారు. తాజాగా బుధవారం రాజమండ్రి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈ వసూళ్ల దందా చేసినట్టు సమాచారం. ఇప్పటి వరకూ కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, రామచంద్రపురం, మండపేట, రావులపాలెం, రంపచోడవరం, ఏలేశ్వరం, తుని తదితర ప్రాంతాల్లో ఇలా గుంజినట్టు పై అధికారుల దృష్టికి కూడా వెళ్లిందని తెలుస్తోంది.
 
 ఇలా వ సూలు చేస్తారు..
 సదరు అవినీతి అధికారికి సహకరిస్తూ.. ఇద్దరు దిగువస్థాయి సిబ్బంది వసూళ్ల తంతును చక్కబెడుతున్నారు. ముందుగా ఆ సిబ్బంది ఇద్దరు ఎంచుకున్న కార్యాలయానికి వెళ్లి, పథకం ప్రకారం ‘టార్గెట్’ చేసిన ఉద్యోగితో ముందస్తుగా మాట్లాడతారు. మీపై పలు ఆరోపణలు ఉన్నాయంటారు. ఆ మాటలకు భయపడి ముడుపులు సమర్పించుకుంటే సరేసరి. లేకుంటే ‘పై అధికారులు కార్యాలయం, ఇళ్లు, ఇతర ఆస్తులపై ఏకకాలంలో దాడులు చేస్తారని బెదిరిస్తారు. వచ్చింది ఏసీబీ అధికారులు...చేస్తున్నది ప్రభుత్వ ఉద్యోగం.. అని భయపడిన ‘అవినీతి అధికారులు’  వారు అడిగిన మొత్తం సమర్పించుకోవడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. త్వరలో బదిలీ కానున్నదనే సదరు అవినీతి అధికారి ఈ దందాకు పాల్పడుతున్నారంటున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, అతడి అవినీతికి అడ్డుకట్ట వేయాలని పలు శాఖల అధికారులు, సిబ్బంది కోరుతున్నారు.

మరిన్ని వార్తలు