అవినీతి ‘లక్షణ’రావు

20 Nov, 2014 01:30 IST|Sakshi
అవినీతి ‘లక్షణ’రావు

 యనగరం ఫోర్ట్: అవినీతి నిరోధక శాఖ వలకు మరో అవినీతి చేప చిక్కింది. లంచాలు మరిగి, బాధ్యతలు మరిచిన పంచాయతీ రాజ్ అధికారిని ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. ఓ బాధితుడు ఇచ్చిన సమాచారంతో అవినీతి అధికారి ఆట కట్టించారు. ఏసీబీ డీఎస్పీ లక్ష్మీపతి తెలిపిన వివరాల ప్రకారం మెంటాడ మండలం జక్కువ గ్రామానికి చెందిన శంకరరావు అనే కాంట్రాక్టర్ గత కొంత కాలంగా కురుపాంలో మండల పరిషత్ భవనాన్ని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన బిల్లులు చెల్లించాలని కొద్దిరోజులుగా కురుపాం పంచాయతీ రాజ్ శాఖ డీఈ పీఎస్‌వీ లక్ష్మణరావును కోరుతున్నాడు. అయితే చేయి తడపనిదే పని చేసే అలవాటు లేని డీఈ రూ.13,500 లంచం కావాలని డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వకుంటే బిల్లులు చెల్లించేది లేదని చెప్పడంతో విసుగు చెందిన శంకర్‌రావు   మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
 
 ఏసీబీ అధికారులు చెప్పిన ప్రకారం కాంట్రాక్టర్ శంకర్‌రావు డీఈకి ఫోన్ చేసి ‘అడిగిన డబ్బు ఇస్తాను ఎక్కడకు రావాల’ని అడగడంతో... బుధవారం జిల్లా పరిషత్ కార్యాలయం వద్దకు రావాలని డీఈ లక్ష్మణరావు తెలిపారు.  దీంతో ఏసీబీ అధికారులు జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద కాపు కాశారు. డీఈ లక్ష్మణరావు రాగానే శంకర్‌రావు అతని వద్దకు వెళ్లి రూ.13,500 ఇచ్చాడు. అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా డీఈని పట్టుకున్నారు. డీఈని అదుపులోకి తీసుకుని విచారణ చేపడతామని ఏసీబీ డీఎస్పీ లక్ష్మీపతి తెలిపారు. డీఈ లక్ష్మణరావు విశాఖపట్నంలో నివాసం ఉంటున్నారు. ఆయన ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తామని డీఎస్పీ తెలిపారు.

 

మరిన్ని వార్తలు