వర్సిటీలో నినదించిన సమైక్యాంధ్ర

1 Aug, 2013 06:18 IST|Sakshi

ఏఎన్‌యూ, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వద్దని.. సమైక్యరాష్ట్రమే ముద్దని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నినదించింది. రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ బుధవారం ఉదయం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనచేశారు. బాలుర వసతి గృహాల నుంచి వర్సిటీ ప్రధానద్వారం వరకు యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. సోని యా, కేసీఆర్, రాహుల్‌గాంధీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వర్సిటీ ప్రధానద్వారం ఎదుట జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్రవిభజనకు కారకురాలైన సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనంచేశారు. ఈ సందర్భంగా సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు మాట్లాడుతూ తెలుగుజాతిని ముక్కలు చేసే అధికారం సోనియాగాంధీకి ఎవరిచ్చారంటూ ప్రశ్నించారు. తెలుగువారి అభివృద్ధిని అడ్డుకునే కుట్రలో భాగంగానే రాష్ట్ర విభజనకు పూనుకున్నారని మండిపడ్డారు. విభజన నిర్ణయాన్ని యూపీఏ సర్కార్ వెనక్కి తీసుకునేవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.
 
 అనంతరం వైస్‌చాన్సలర్ ఆచార్య కె.వియన్నారావును కలిసి మూడురోజుల బంద్ కు సహకరించాలని, అకడమిక్ ఎగ్జిబిషన్ తదితర అధికారిక కార్యకలాపాలను వాయిదావేయాలని కోరారు. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ పిలుపు మేరకు యూనివర్సిటీలోని కళాశాలలు, కార్యాలయాలు స్వచ్చందంగా బంద్ పాటించాయి. కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ నాయకులు బి.అశిరత్నం, బి.వెంకటేశ్వర్లు, కె.కిషోర్, పి.శ్యాంసన్, ఉద్యోగ జేఏసీ నాయకులు కోడూరి కనకరాజు తదితరులు పాల్గొన్నారు.
 
 పలు కార్యక్రమాలు వాయిదా..
 సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ మూడురోజుల బంద్‌కు పిలుపునివ్వడంతో వర్సిటీలో జరగాల్సిన పలు కార్యక్రమాలను వాయిదావేస్తున్నట్లు వర్సిటీ అధికారులు ప్రకటించారు. గురువారం నుంచి మూడు రోజులపాటు జరగాల్సిన అకడమిక్ ఎగ్జిబిషన్‌ను వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య ఆర్‌ఆర్‌ఎల్ కాంతం ప్రకటించారు.
 
 ఎగ్జిబిషన్ ఆగస్టుమూడు నుంచి ఐదో తేదీవరకు జరుగుతుందని తెలిపారు. ఆగస్టు 2న జరగాల్సిన వర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ స్థాయి సలహామండలి సమావేశం, ప్రకాశం, గుంటూరు జిల్లాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ల సమావేశం వాయిదా వేశామని ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కె.సుమంత్‌కుమార్ తెలిపారు. వీటిని నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ బంద్ వల్ల వర్సిటీలో బుధవారం జరగాల్సిన ధార్మికోపన్యాసం, ఆన్‌లైన్ కౌన్సెలింగ్ కేంద్రంలో జరుగుతున్న పీజీ ఈసెట్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాలు రద్దయ్యాయి.
 

మరిన్ని వార్తలు