సిద్ధార్థ జూబిలేషన్‌లో ‘సినీ’ సందడి

27 Apr, 2019 11:04 IST|Sakshi

హాజరైన హీరోయిన్‌ అనుపమ, ప్రముఖ డ్యాన్సర్లు

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

యువపారిశ్రామిక వేత్తలకు చేయూత: చైర్మన్‌ అశోకరాజు

నారాయణవనం: సిద్ధార్థ గ్రూప్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ కళాశాల జూబిలేషన్‌ ఉత్సవాల్లో ప్రముఖ హీరో యిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ సందడి చేశారు. అదేవిధంగా యాంకర్‌ మంజుషా వ్యాఖ్యానం యువతను ఉత్సాహపరచగా, డ్యాన్సర్లు నట రాజ్, మైథిలీ, హక్సాఖాన్, మహాలక్ష్మి బృందాల నృత్య ప్రదర్శన యువతను ఉర్రూతలూగించింది. మూడు రోజుల పాటు నిర్వహించే జూబిలేషన్‌ గురువారం ప్రారంభమైంది. శుక్రవారం సాయంత్రం కళాశాల ఓపెన్‌ ఆడిటోరియంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో సిద్ధార్థ గ్రూప్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. రాత్రి 8 గంటలకు నటరాజన్‌ మాస్టర్‌ బృందం ప్రదర్శించిన గణనాయక పాటతో ప్రారంభమైన ఈ కార్యక్రమం అర్ధరాత్రి వరకు కొనసాగింది. సినీ నృత్య బృందాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.

యువతకు ఆర్థిక చేయూత
తమ కళాశాలలో అభ్యసించి యువ పారిశ్రామిక వేత్తలుగా ఎదిగే యువ ఇంజినీర్లకు రూ.లక్ష నుంచి కోటి వరకు ఆర్థిక సాయం అందజేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని కళాశాల చైర్మన్‌ డాక్టర్‌ అశోకరాజు తెలిపారు. శుక్రవారం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాల ప్రారంభానికి ముందు జరిగిన పేరెంట్స్‌మీట్‌లో అశోకరాజు ప్రసంగించారు. ప్రపంచ స్థాయి నాణ్యతకు తగ్గట్టుగా కళాశాలలో సాంకేతిక సౌకర్యాలతో కూడిన ల్యాబ్‌లను ఏర్పాటు చేశామన్నారు. కోర్సు పూర్తి చేసుకుని  దేశాభివృద్ధిలో భాగసామ్యం కావడానికి పరిశ్రమలను నెలకొల్పే ఉత్సాహవంతులకు విద్యా సంస్థల ద్వారా ఆర్థిక సాయంతో పాటు అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందజేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా 198 మంది అకడమిక్‌ టాపర్లు, 212 మంది క్రీడల్లో రాణించిన యువ ఇంజినీర్లకు ట్రోఫీలు, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. టాపర్లుగా, బెస్ట్‌ అవుట్‌ గో యింగ్‌గా నిలిచిన నలుగురు విద్యార్థులకు అనుపమ పరమేశ్వరన్‌ చేతుల మీదుగా ల్యాప్‌టాప్‌లు అందజేశారు.  కళాశాల వైస్‌ చైర్మన్‌ ఇందిరవేణి, ప్రిన్సిపాళ్లు డాక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, సంగమేశ్వరాజు, రాజకీయ ప్రముఖులు గంధమనేని రమేష్‌ చంద్రప్రసాద్, పాకా రాజాలతో పాటు వివిద విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు