‘పోలీసులైనా, ప్రజలైనా చర్యలు తప్పవు’

3 Aug, 2018 19:07 IST|Sakshi

ఏలూరు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన శ్రీ గౌతమి హత్య కేసులో పూర్తి స్థాయి విచారణ చేయిస్తామని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ స్పష్టం చేశారు. అదే సమయంలో చింతలపూడి వసతి గృహం బాలిక అత్యాచారం కేసులో కూడా విచారణ చేపడతామన్నారు. ఈ కేసుల్లో పోలీసుల తప్పు ఉందని తేలితే ఎలాంటివారినైనా ఉపేక్షించమని ఠాకూర్‌ తెలిపారు. అసలు పోలీసులు పని చేసేది ప్రజల కోసమేనని, రౌడీయిజం, రోడ్డు ప‍్రమాదాలు, నేర నిరోధకంపై జిల్లా యంత్రాంగానికి సూచనలిచ్చామన్నారు.

శుక్రవారం ఏలూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన డీజీపీ.. పశ్చిమలో జిల్లా ఎస్పీ రవి ప్రకాశ్‌ పనితీరు బాగానే ఉందని కితాబిచ్చారు. నూతన టెక్నాలజీతో మరింత వేగంగా ప్రజలకు సేవలందించాలని ఆయన సూచించారు. అమరావతిలో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌, ఫోరెన్సిక్‌ యూనివర్శిటీలను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా జిల్లాల వారీగా ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల ఏర్పాటుపై ఆలోచిస్తున్నామన్న డీజీపీ.. పెరుగుతున్న సైబర్‌ క్రైమ్‌లు నిరోధించేందుకు శిక్షణ ఇస్తున్నామన్నారు. ప‍్రతీ జిల్లాలో సైబర్‌ క్రైమ్‌ నివారణకు ప్రత్యేక స్టేషన్లు ఏర్పాటు చేస్తున‍్నామన్నారు. సిబ్బంది సంతృప్తిగా ఉంటేనే పోలీసు శాఖలో ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు.

నెల్లూరు జిల్లా రావూరుపాడు పోలీస్‌ స్టేషన్‌పై దాడి ఘటన చాలా విచారకరమన్న డీజీపీ ఠాకూర్‌.. తప్పు ఎవరిదైనా లా అండ్‌ ఆర్డర్‌ చేతుల్లోకి తీసుకోవద్దన్నారు. తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకుంటామని, అది ప్రజలైనా, పోలీసులైనా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

మరిన్ని వార్తలు