ఎల్లవేళలా మందు.. కొట్టు..!

20 Jan, 2014 02:01 IST|Sakshi
సాక్షి, నరసరావుపేట :రాత్రి సమయాల్లోనూ నగదు డ్రా చేసుకునేందుకు బ్యాంకులు ఏటీఎం సెంటర్‌లు ఏర్పాటు చేసినట్లే... మద్యం దుకాణాల నిర్వాహకులు కూడా ఈ పాలసీని ఆదర్శంగా తీసుకుని ఎనీటైమ్ మద్యం (ఏటీఎం) అంటూ విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఎక్సయిజ్ అధికారులు మామూళ్ల మత్తులో చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. శాంతిభద్రతల అంశంపై రాత్రి పది దాటితే దుకాణాలు మూసేయాలంటూ చిరువ్యాపారులపై ప్రతాపం చూపే పోలీసులు కూడా మద్యం దుకాణాలకు మాత్ర మినహాయింపు ఇస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు.నిబంధనలు బేఖాతరు.. వైన్‌షాపుల్లో క్వార్టర్ సీసాకు రూ.10 నుంచి రూ.15, ఫుల్ బాటిల్‌కు అత్యధికంగా రూ.150 వరకు ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇటు బార్లలోనూ ఈ ధర దాదాపు రెట్టింపుగా ఉంది. ఇలా విక్రయాలు చేసుకోవడానికి లోపాయకారిగా సహకరిస్తున్నందుకుగాను మామూళ్లను మళ్లీ నిర్ణయించారు.
 
 ఎమ్మార్పీ ఉల్లంఘనలు, రాత్రి పూట వ్యాపారం కొనసాగించేందుకు, వెన్‌షాపుల్లోనే మద్యం తాగే ఏర్పాట్లకు గాను గతంలో ఎక్సయిజ్ శాఖకు ఒక్కో షాపు నుంచి నెలకు సగటున రూ.20 వేలు ముట్టజెప్పేవారు. ప్రస్తుతం రూ. 5 వేల నుంచి రూ. 7వేలు వరకు ఉంది. బార్లు, వైన్‌షాపులు నిర్ణీత కాల వ్యవధి లేకుండా ఇష్టానుసారంగా నిర్వహించడానికి, బార్లలో జరిగే వివాదాలను సెటిల్‌మెంట్ చేయడానికి పోలీసు శాఖకు గతంలో ఒక్కో బార్ నుంచి రూ.15వేల వరకు చెల్లించేవారు. ప్రస్తుతం రూ. 5 వేలుగా ఉంది. బార్లు, వైన్‌షాపుల్లో కనీస వేతనాలు అమలు చేయకుండా ఉండడం, బాలకార్మికులతో పనిచేయించేందుకు వీలుగా కార్మిక శాఖకు రూ.1000 నుంచి రూ.2 వేల వరకు ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే మద్యం ధరలు 8 నుంచి 10శాతం పెరిగాయి. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తుండడంతో ఒక్క నరసరావుపేట డివిజన్‌లోనే గతేడాది రూ.300 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మళ్లీ రంగంలోకి దిగితే కాని మద్యం ధరలు కట్టడయ్యేలా లేవు.
 
 ఈఎస్‌పై మంత్రి కాసు ఆగ్రహం..
 నరసరావుపేట పట్టణంలో  తెల్లవారుజాము వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంచుతున్నారని కొందరు సహకార శాఖ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి దష్టికి తీసుకురావడంతో ఆయన ఎక్సయిజ్ సూపరింటెండెంట్ (ఈఎస్) మనోహకు ఫోన్ చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీకు తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా అంటూ మండిపడ్డారు. కొందరు మద్యం వ్యాపారులు తన పేరు వాడుతున్నారని, ఇవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యవహరించాలని, లేని పక్షంలో నీపై ఎక్సయిజ్ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.
 
మరిన్ని వార్తలు