భయోమెట్రిక్

25 Feb, 2014 01:58 IST|Sakshi
భయోమెట్రిక్
  • ‘ఉపకారం’ మంజూరుకు కొత్త విధానం
  •  సర్కారు గిమ్మిక్కుతో విద్యార్థులకు చిక్కులు
  •  విద్యార్థులకు లబ్ధిచేకూర్చే పథకాలకు ఎన్ని అడ్డంకులు సృష్టించాలో అన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో పెడుతోంది. తాజాగా ఉపకార వేతనాల మంజూరుకు సర్కారు ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ విధానంతో విద్యార్థులు కొత్త చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఈ విధానంలో లబ్ధిదారులైన విద్యార్థుల వేలిముద్రలను ప్రభుత్వం ఆధార్ లింక్ ద్వారా తీసుకుని బయోమెట్రిక్ మెషీన్‌లో నిక్షిప్తం చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాతే అసలు సమస్య మొదలవుతోంది. ఈ ప్రక్రియ ముగిశాక మళ్లీ విద్యార్థుల వేలిముద్రలు సేకరిస్తున్నారు. అవి పాతవాటితో సరిపోని పక్షంలో ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు గండికొడుతుండడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
     
    నూజివీడు, న్యూస్‌లైన్ : గతంలో కళాశాల విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను మంజూరుచేయాలంటే అధికారులే సంబంధిత విద్యాసంస్థకు వెళ్లి దరఖాస్తులను పరిశీలించేవారు. కానీ ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ఆధార్ కార్డుకోసం విద్యార్థులిచ్చిన వేలిముద్రలను ప్రభుత్వం లింక్ ద్వారా తీసుకుని వాటిని బయోమెట్రిక్ మెషీన్‌లో పొందుపరిచింది. విద్యార్థులు ఉపకార వేతనాలకోసం దరఖాస్తు చేసుకోవడం పూర్తయిన తర్వాత మరోసారి వేలిముద్రలను సేకరిస్తున్నారు.

    ఇవి పాత వేలిముద్రలతో సరిపోతేనే వారికి ఉపకారవేతనం, ఫీజు రీయింబర్స్‌మెంట్ మంజూరుచేస్తున్నారు. లేకుంటే దరఖాస్తులను పక్కన పెడుతున్నారు.  మరికొంతమందికి ఆధార్ కార్డులున్నప్పటికీ వారి వేలిముద్రలను బయోమెట్రిక్    మెషీన్‌లు తీసుకోవడం లేదు. ఆధార్ దిగినప్పటికీ కార్డు రానివారు వందలాదిమంది విద్యార్థులున్నారు. వారందరి వేలిముద్రలను కూడా ఈ మెషీన్ తీసుకోవడం లేదు. ఫలితంగా వారందరి దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. దీంతో కొన్ని కళాశాలల యాజమాన్యాలు వారందరినీ ఫీజులు చెల్లించాల్సిందేనని కరాఖండిగా చెబుతున్నాయి.

    ఇక తమకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ మంజూరుకాదేమోనని  విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిని జిల్లాలోని డిగ్రీ, పీజీ, ఇంజినీరింగు, ఫార్మసీ కళాశాలల్లో చదువుకుంటున్న వందలాది మంది విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయాన్ని పలువురు ప్రజావాణిలో అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. ఇంటర్మీడియెట్ విద్యార్థులకు మాత్రం బయోమెట్రిక్ విధానం లేకపోవడంతో వారికి ఎలాంటి ఇబ్బందీ లేదు.  
     
     మూడుసార్లు దిగినా కార్డు రాలేదు..
     మొదటిసారి ఆధార్ దిగినప్పుడు కార్డు రాలేదు. అధికారులను అడిగితే మళ్లీ ఫొటో తీశారు. అయినా రాలేదు. మూడోసారి విజయవాడలో మళ్లీ దిగాను. అయినా నాకు ఇంతవరకు కార్డు అందలేదు. బయోమెట్రిక్ మెషీన్ నా వేలిముద్రలను తీసుకోవడం లేదు.  అసలు ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తుందో, రాదో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా నా సమస్యను అధికారులు పరిష్కరించాలి.
     -ముత్యాల ప్రియాంక, డిగ్రీ విద్యార్థిని నూజివీడు
     
     విజయవాడ వెళ్లండి..
     బయోమెట్రిక్ మెషీన్‌లో వేలిముద్రలు నమోదు కాని విద్యార్థులు విజయవాడలో ఉన్న శాశ్వత ఆధార్ కేంద్రానికి వెళ్లి తమ వేలిముద్రలు నమోదు చేయించుకోవాలి. అప్పటికీ వేలిముద్రలు సరిపోకపోయినా, మెషీన్ తీసుకోకపోయినా వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం.
     -మధుసూదనరావు,
     జేడీ, సాంఘిక సంక్షేమ శాఖ
     

మరిన్ని వార్తలు