నకిలీ మావోయిస్టు అరెస్టు

29 Aug, 2014 03:25 IST|Sakshi
  •    ‘పుట్టగుంట’కు బెదిరింపు కాల్స్ కేసులో వీడిన మిస్టరీ
  •   నిందితుడు కరీంనగర్ జిల్లా వాసి
  •   నూజివీడు డీఎస్పీ సీతారామస్వామి వెల్లడి
  • హనుమాన్‌జంక్షన్ : పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్ కుమార్‌ను సొమ్ము డిమాండ్ చేసిన నకిలీ మావోయిస్టును హనుమాన్‌జంక్షన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూజివీడు డీఎస్పీ జె.సీతారామస్వామి ఈ వివరాలు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తి గ్రామానికి చెందిన నిందితుడు పత్తి శ్రీనివాసరెడ్డి(31)ని ఈ సందర్భంగా మీడియాకు చూపారు.

    డీఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం.. మావోయిస్టు అగ్రనేత గణపతి పేరుతో సతీష్‌కుమార్‌కు ఇటీవల వరుసగా ఫోన్ కాల్స్ వచ్చాయి. పార్టీ ప్లీనరీ కోసం చందాలు ఇవ్వాలంటూ ఫోన్‌కాల్స్ చేసిన వ్యక్తి రెండు బ్యాంక్ అకౌంట్ నంబర్లు ఇచ్చాడు. దీనిపై సతీష్‌కుమార్ ఈనెల 22న స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వై.వి.రమణ, ఎస్సై ఐ.వి.నాగేంద్రకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో మావోల కదలికలు, ప్రభావం అధికంగా ఉండే కరీంనగర్ జిల్లా జమ్మికుంట, వీణవంక ప్రాంతాల నుంచి ఫోన్‌కాల్స్ వస్తున్నట్లు గుర్తించారు.

    ఇక్కడి నుంచి సీఐ నేతృత్వంలో పోలీసు బృందం ఆ ప్రాంతానికి వెళ్లింది. నిందితుడి ఫోన్‌కాల్స్ జాబితా, అతడు ఇచ్చిన బ్యాంక్ అకౌంటు నంబర్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టింది. నిందితుడు తెలిపిన కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఆంధ్రాబ్యాంకు బ్రాంచిలో అకౌంటు అక్కడి రిటైర్డ్ పోస్టుమాస్టర్ పేరిట ఉండటంతో జంక్షన్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. కనపర్తి గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి కొన్నిరోజుల కిందట తన అకౌంటు నంబరు అడిగితే ఇచ్చినట్లు రిటైర్డ్ పొస్టుమాస్టర్ తెలిపాడు.

    శ్రీనివాసరెడ్డి తాను ఉపయోగించే సిమ్‌కార్డు, బ్యాంకు అకౌంట్లు తన పేరిట లేకుండా జాగ్రత్త పడ్డాడు. స్నేహితులు, బంధువులు డబ్బులు పంపుతారని చెప్పి ఇరుగుపొరుగు వాళ్ల బ్యాంకు అకౌంటు నంబర్లను తీసుకుని ఈ తరహా బెదిరింపు వసూళ్ల కోసం వాడుకుంటున్నట్లు విచారణలో వెల్లడైంది. దీంతో కరీంనగర్ పోలీసుల సహకారంతో శ్రీనివాసరెడ్డిని జంక్షన్ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

    ఈ కేసులో క్రీయాశీలకంగా వ్యవహరించిన సీఐ వై.వి.రమణ, ఎస్సై నాగేంద్రకుమార్, హెడ్ కానిస్టేబుళ్లు ఎన్. శివాజీ గణేష్, కె.పెద్దిరాజులు, కానిస్టేబుళ్లు బి.వి.రామతులసీరావు, ఎ.హరిబాబులను ఆయన అభినందించారు. కేసును త్వరగా ఛేదించేందుకు కృషి చేసిన ఎస్పీ, దర్యాప్తు బృందానికి ‘పుట్టగుంట’ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.
     
    ఈజీ మనీ కోసం అడ్డదారిలో..
     
    శ్రీనివాసరెడ్డిపై ఇప్పటి వరకు పదికిపైగా ఈ తరహా కేసులు నమోదైనట్లు డీఎస్పీ సీతారామస్వామి చెప్పారు. అతడి స్వస్థలం నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావటంతో దాన్ని ఆసరా చేసుకుని ధనికులకు ఫోన్లు చేసి మావోయిస్టుల పేరుతో చందాలు వసూలు చేసేవాడని తెలిపారు. రాష్ట్రవాప్తంగా చాలామంది పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు, రాజకీయ నాయకులు ఇతడి చేతిలో మోసపోయారని తేలిందన్నారు. శ్రీనివాసరెడ్డి 2011లో వరంగల్ కాకతీయ విశ్వ విద్యాలయంలో ఎం.ఏ సోషియాలజీ పూర్తి చేశాడన్నారు. ఆ తర్వాత ఉద్యోగాల కోసం ప్రయత్నించి విఫలమయ్యాడన్నారు.

    జమ్మికుంటలో దూరవిద్యా కేంద్రం ఏర్పాటు చేసి ఆర్థికంగా దెబ్బతిన్నాడన్నారు. దీంతో ఈజీ మనీకోసం మావోల పేరుతో తొలుత పరిసర గ్రామాల రాజకీయ నాయకులను బెదిరించాడన్నారు. క్రమంగా ఇంటర్‌నెట్ సహాయంతో ఇతర ప్రాంతాల వారి ఫోన్ నంబర్లు కూడా సేకరించి మావోయిస్టు పేరుతో చందాలు వసూలు చేశాడన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెట్రోలు బంకుల యాజమానుల ఫోన్‌నంబర్లను నెట్‌లో సేకరించి వారిని ఫోన్ చేసి బెదిరించేవాడని డీఎస్పీ తెలిపారు.

    ఈక్రమంలోనే పుట్టగుం టకు ఫోన్‌కాల్స్ చేశాడని పేర్కొన్నారు. వీణవంక పోలీస్‌స్టేషన్‌లో అతడిపై రౌడీషీట్ ఉందన్నారు. జమ్మికుంట పోలీస్‌స్టేషన్‌లో ఎనిమిది, హన్మకొండ స్టేషన్‌లో ఒక కేసు ఇతనిపై ఉన్నట్లు డీఎస్పీ చెప్పారు. మూడెకరాల ఆసామి అయిన శ్రీనివాసరెడ్డికి అక్కడి పోలీసులకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు జంక్షన్ పోలీసులు గుర్తించి నివ్వెరపోయారు.
     

మరిన్ని వార్తలు