ఈ ముఖ్యకార్యదర్శి వద్దు

23 Apr, 2017 16:34 IST|Sakshi

సాక్షి, అమరావతి: పశుసంవర్ధకశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిపై సిబ్బంది తిరుగుబాటు ప్రకటించారు. సుదీర్ఘకాలంగా పాతుకుపోయిన ఆ అధికారి.. అయిన వాళ్లకు ఆకుల్లో, కానివారికి మూకుళ్లలో అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. దీనిపై ఇటీవల బాధ్యతలు చేపట్టిన పశుసంవర్ధకశాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. ఆయన్ని తక్షణమే తమ శాఖ నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రమోషన్లు వస్తాయని భావించిన సిబ్బందికి ఆయన పట్టించుకోకపోవడం శాపంగా మారింది. ప్రమోషన్లు ఇవ్వమని ఇచ్చిన జీవో (నంబర్‌ 126, ఫైనాన్స్‌ 29/6/2016)ను అమలు చేయకుండా పాలనను కుంటుపరుస్తున్నారన్న విమర్శలున్నాయి.

ట్రిబ్యునల్‌ ఆదేశించినా.. బేఖాతరు
రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రమోషన్లపై ఆశతో చాలామంది అందరికంటే ముందే అమరావతి బాట పట్టారు. డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ సిఫార్సుల మేరకు ప్రమోషన్లు వస్తాయని భావించారు. అయితే అప్పటి వ్యవసాయ, పశుసంవర్ధకశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేరు చెప్పి ఆయన పేషీలోని కొందరు లంచా లు డిమాండ్‌ చేశారన్న ఆరోపణలు రావడంతో ఆగిపోయాయి. ఈ వ్యవహారం లో ప్రత్తిపాటికి ఓఎస్‌డీగా వ్యవహరించిన ఓ వ్యక్తి తన ఉద్యోగం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

ఈలోపు మంత్రితో పైరవీలు చేయించుకున్న ఒకరిద్దరికి ఈ ఉన్నతాధికారి ప్రమోషన్లు ఇవ్వడం వివాదాస్పదమైంది. వారిలో ఒకరు డాక్టర్‌ కొండలరావు కాగా మరొకరు జి.సోమశేఖరం. కొండలరావు ఆరోగ్య కారణాల రీత్యా పశుసంవర్ధకశాఖ అదనపు డైరెక్టర్‌గా వ్యవహరించేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో ప్రత్యేక ముఖ్య కార్యదర్శి తనకు సన్నిహితంగా ఉండే సోమశేఖరా న్ని అదనపు డైరెక్టర్‌ను చేసి చక్రం తిప్పుతున్నారు. వాస్తవానికి ఈ ప్రమోషన్‌ కె.కృష్ణమూర్తికి దక్కాల్సి ఉంది. ఏపీ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ కృష్ణమూర్తికి ఇవ్వమని గత డిసెంబర్‌ 12న ఉత్తర్వులిచ్చింది. ఆ ఉన్నతాధికారి పట్టించుకోకుండా ప్రత్తిపాటిని ప్రసన్నం చేసుకునేందుకు సోమశేఖరానికి ప్రమోషన్‌ ఇచ్చారు.

ప్రమోషన్లు ఎవరెవరికీ రావాలంటే
ప్రమోషన్లు ఆశించి భంగపడిన సిబ్బంది తీవ్ర అసంతృప్తితో రగిలిపోతూ పనుల్ని జాప్యం చేస్తున్నారు. ప్రమోషన్ల కోసం చూస్తున్న వారిలో 90 మంది డాక్ట ర్లు, 80 మంది అసిస్టెంట్‌ డైరెక్టర్లు, 10 మంది డిప్యూటీ డైరెక్టర్లు.. ఎంతోమంది సిబ్బంది ఉన్నారు. ఈ విషయమై ఏపీ పశుసంవర్థకశాఖ అధికారుల సేవాసంఘం నేతలు గతంలో ఈ శాఖ మంత్రి ప్రత్తిపాటికి, పశుసంవర్థకశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌కు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది.

మరిన్ని వార్తలు